దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 1000 ఎప్పుడో దాటేశాయి. కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా మరణాల రేటు మాత్రం ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో ఎక్కువగా ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. తెలంగాణలో అత్యధికంగా కేసులు నమోదు కాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిపోవడం ఆందోళనలు రేకెత్తిస్తోంది.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 80కి చేరుకోగా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దానిని మించేలా కనిపిస్తోంది. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ఓ మతసంబంధ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుండి 369 మంది వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. మార్చి 15 నుండి 17 వరకు వారంతా ఢిల్లీలోనే ఉన్నారని నిర్దారించుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా నమోదైన 17 కేసులు వారివేనని తెలిపారు. అక్కడి నుండి వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారు కావడంతో అన్ని ప్రాంతాలమీద ప్రత్యేక దృష్టి సారించారు.
వెళ్లి వచ్చిన వారికి పరీక్షలు చేయడం, వారిని క్వారెంటైన్‌కి తరలించడం ఒక ఎత్తైతే ఇప్పుడు వారంతా ఎలా వచ్చారు. ఎక్కడెక్కడ ప్రయాణాలు చేశారు. ఎవరెవరిని కలిశారు, ఎంత మందిని కలిశారు అన్న అంశాలను సేకరించడం చాలా కష్టమైన అంశంగా మారిపోతోంది. ఈ ప్రక్రియ ఏ మాత్రం ఆలస్యమైనా జరగాల్సిన నష్టం జరిగిపోతుందని నిపుణులు, రాష్ట్రంలో భారీగా కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంఛనా వేస్తున్నారు.