అవినీతి జరిగితే క్రిమినల్ కేసులే

జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ తర్వాత పరిస్దితిలో మార్పు వచ్చినట్లే కనిపిస్తోంది. విద్యుత్ రంగంలో పిపిఏలను సమీక్షించటంలో ఎటువంటి తప్పు లేదని ఇపుడు కేంద్రం కోర్టులో చెప్పింది. అంతేకాదు పిపిఏల్లో అవినీతి జరిగిందని ఆధారాలుంటే క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చని స్పష్టం చేసింది.

పిపిఏలపై జగన్  సమీక్షలనగానే కేంద్రప్రభుత్వం మండిపడిన విషయం తెలిసిందే. దానికి తగ్గట్లే రాష్ట్ర బిజెపి నేతలు కూడా జగన్ నిర్ణయంపై విరుచుకుపడటం మొదలుపెట్టారు. చంద్రబాబునాయుడు విషయం అయితే చెప్పనే అక్కర్లేదు. ఊరు వాడలో ఎల్లోమీడియా అండతో పిపిఏ సమీక్షలపై ఒకటే గగ్గోలు పెట్టేస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే జగన్ ఢిల్లీ టూర్ చేశారు. తన పర్యటనలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో కూడా భేటీ అయ్యారు. తన భేటిలో ప్రధానంగా పిపిఏల సమీక్ష, పోలవరంలో అవినీతి, రివర్స్ టెండరింగ్ లో భాగంగా కాంట్రాక్టుల రద్దు పైనే జగన్ తన వాదన వినిపించారు.

మొత్తానికి వాళ్ళ మధ్య చర్చలు ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. కానీ జగన్ ఢిల్లీ పర్యటన తర్వాతే కేంద్రం కోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. దాంతో జగన్ నిర్ణయాలకు మద్దతుగానే తన వాదన వినిపించింది. హోలు మొత్తం మీద జగన్ ఢిల్లీ పర్యటన సానుకూలమైనట్లే కనిపిస్తోంది.