అమరావతి పోరు అంతర్జాతీయ స్థాయికి

రాష్ట్రరాజధాని అమరావతి విషయంలో పాలక వైసీపీ ప్రభుత్వ తీరును మొదటి నుండి వ్యతిరేకిస్తున్న ఎన్నారైలు.. తాజాగా ఈ అంశాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సవాలు చేస్తూ ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్నారైల తరఫున శ్రీనివాస్ కావేటి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో వైసీపీ ప్రభుత్వంపై పిటిషన్ దాఖలు చేశారు. అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలని, రైతులకు న్యాయం చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు పిటిషన్‌లో వారు కోరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో ఎన్నారైలు వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం స్వీకరించింది. అయితే ఈ వివాదం అక్కడితో ఆగలేదు.. అమరావతి ప్రాంత రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై, ఉద్యమం చేస్తోన్న సమయంలో రాజధాని రైతులు, మహిళల పట్ల అమానుష చర్యలు, మానవహక్కుల ఉల్లంఘనలపై యూఎన్ఓ మానవ హక్కుల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్తామని ఎన్నారైలు స్పష్టం చేస్తున్నారు.

రైతులకు అండగా ఉండేందుకు ఎన్నారైలు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాజధాని అమరావతి ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, తమ పోరాటానికి అన్ని వర్గాల వారు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. అయితే విద్యుత్ ఒప్పందాల విషయంలోనే కేంద్రం నుండి ఎంత మంది పెద్దలు చెప్పినా వారి మాటలు వినని వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు రాజధాని మార్పు వంటి కీలక అంశంలో ఎన్నారైల పిటిషన్లను, లేదా అంతర్జాతీయ న్యాయస్థాన విచారణలను పట్టించుకుంటుందా? లేదా అన్నది ముందు ముందు తెలుస్తుంది.