అమరావతి గ్రామాల్లో స్థానిక ఎన్నికలు లేవు!

ఆంధ్రప్రదేశ్‍‌లో స్థానిక ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. ప్రభుత్వం గెజిట్ నోట్ కూడా విడుదల చేసింది. రిజర్వేషన్లు ఖరారైపోయాయి. పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో, వ్యూహాల రచనలో తలమునకలై ఉన్నాయి. అయితే రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో మౌనం అలుముకుని ఉంది. ఈ ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు ఏ మాత్రం కనిపించడంలేదు.

ఎందుకు అంటే.. రాజధాని గ్రామాలను ప్రత్యేక కార్పోరేషన్‌ పరిధిలోకి తీసుకు వచ్చే యోచనలో ఉన్న ప్రభుత్వం ఆ దిశగా కసరత్తులు చేస్తోంది. దీంతో ఈ గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేందుకు అవకాశాలు లేనట్లే కనబడుతోంది. ముఖ్యంగా ఇందులో కొన్నిగ్రామాలను ఇతర మున్సిపాలిటీల్లో విలీనం చేస్తుండడం కూడా దీనికి ఒక ప్రధాన కారణంగా తెలుస్తోంది.

అలాగే తుళ్లూరు మండలంలోని గ్రామాలతో పాటు నీరుకొండ, నిడమర్రు, కృష్ణాయపాలెం, కురగల్లు గ్రామాలను కలిపి ప్రభుత్వం అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తోంది అంతేకాకుండా, మంగళగిరి పురపాలికల్లో బేతపూడి, నవులూరు, యర్రబాలెం గ్రామాలను కలపాలని, ఉండవల్లి, పెనుమాక గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిటీలో కలపాలని ప్రతిపాదనలు ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ఆయా గ్రామాలను స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి రాష్ట్రమంతా ఎన్నికలు ఉన్నా అమరావతి మాత్రం ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వస్తోందన్నమాట.