అప్పుడే  కరోనా బాధితులను కాపాడుకోగలం ! 

 
దేశంలో కరోనా మహ్మమారి విజృంభిస్తున్నప్పటికి  నిరంతరంగా  తమ వైద్యసేవలను కొనసాగిస్తున్న  వైద్యులను ఎంతైనా  అభినందించాలి. కానీ  అలాంటి వైద్యుల పై కొందరు దాడులకు దిగిన సంఘటన గాంధీ ఆస్పత్రిలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.  తెలంగాణలో ఇప్పటికే పలుమార్లు వైద్యులు దాడులు జరిగిన సంఘటనలు చాల వెలుగు చూశాయి. అయినా,  కరోనా రోగి మృతిచెందాడని,  వైద్యులు నిర్లక్ష్యం వల్లే రోగి చనిపోయాడని అతడి తరుపు బంధువులు జూనియర్ వైద్యుల పై దాడికి దిగడం,  ఆస్పత్రిలోని ఫర్నిచర్ ధ్వంసం చేయడం  చూస్తుంటే   ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజులు ఎలా ఉంటాయో !
 
అసలు లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్నా  కంటైన్మెంట్ జోన్లు, బఫర్ జోన్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు ఎందుకు తీసుకోవడం లేదు ?  ఇంటింటి సర్వే నిర్వహించి రోగులను గుర్తించాలని కేంద్రం చెబుతున్నా  ఇక్కడి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు.  ఇప్పటికైనా  జన సాంద్రత ఎక్కువగా  ఉన్న ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేపట్టి  అవసరమైన పరీక్షలు నిర్వహించి కరోనా లక్షణాలున్న వారికి విడిగా చికిత్స అందించాలి.  అలాగే  టెస్టు ఫలితాలు త్వరగా వచ్చేలా చూడాలి.  బాధితులకు అన్నిరకాల వైద్య సేవలు అందించి మరణాలను తగ్గించేలా చూడాలి, ముఖ్యంగా  అంబులెన్స్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలి. 

ఇంటింటా సర్వే నిర్వహించేందుకు తగిన సంఖ్యలో టీములను ఏర్పాటు చేసుకోవాలనే విషయాన్ని కూడా కెసిఆర్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి.  వైరస్ వ్యాప్తి చెందకుండా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు, అధికారుల తమ సహకారం అందివ్వాలి.  బఫర్‌ జోన్ల పరిధిలో జ్వరం, జలుబు, శ్వాసకోశ సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలున్న వారిని గుర్తించి  వారికి వేరుగా చికిత్స అందిస్తేనే  బాధితులను కాపాడుకోగలం.