అధికారుల పోస్టింగుల విషయంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వానికి తొలి నుండి కోర్టుల బెడద ఎక్కువైంది. ఏ రాష్ట్రంలోగాని కొత్తగా ఏర్పడిన ఏ ప్రభుత్వమూ ఎదుర్కోని విధంగా కోర్టు కేసులు ఈ ప్రభుత్వానికి మెడకు చుట్టుకొంటున్నాయి. ప్రభుత్వ లాయర్లు న్యాయ మూర్తుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమతమౌతున్నారు. ఇటీవల కాలంలో ఈ బెడద ఎక్కువైనందున కాబోలు పోస్టింగ్ ల కోసం ఎదురుచూస్తున్న 37 మంది డిఎస్పీలకు పోలీసు శాఖ అర్థరాత్రి వేళ పోస్టింగ్ లు ఇచ్చింది. .

ఇందుకు పూర్వరంగం లేక పోలేదు. ఐ ఆర్ యస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ పై అవినీతి ఆరోపణలు చేసి రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఏడెనిమిది నెలలు జీతాలు ఇవ్వ లేదు. ఆ అధికారి క్యాట్ ను ఆశ్రయించగా ప్రభుత్వానికి అక్షింతలు పడ్డాయి. జీతం ఎందుకు చెల్లించ లేదని క్యాట్ నిలదీసింది. ఈ కేసు సందర్భంగా ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వంపై పలు వ్యాఖ్యానాలు చేసింది. తుదకు రాష్ట్రం ప్రభుత్వం అతనికి జీతం మొత్తంగా ఇచ్చింది.

వెనువెంటనే ఇలాంటి కేసు మరొకటి కోర్టు కెక్కింది. చంద్రబాబు నాయుడు వద్ద నిఘా అధికారిగా పని చేసిన వెంకటేశ్వర రావును సస్పెండ్ చేయడం ఆ అధికారి క్యాట్ ను ఆశ్రయించడం జరిగింది. గమనార్హమైన విశేష మేమంటే క్యాట్ కొశ్చిన్ చేయక ముందే వెంకటేశ్వర రావు జీతం ఇచ్చేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. ఒక విధంగా ప్రభుత్వ పరువు పోయినట్లే కాకుండా నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందనే అభిప్రాయం బలపడింది.

ఇదిలా వుండగా చంద్రబాబు నాయుడు హయాంలో కీలక స్థానాల్లో వుండిన పలువురు పోలీసు అధికారులకు పోస్టింగ్ లు ఇవ్వకుండా ప్రభుత్వం సాగ లాగింది. ఏ అధికారినైనా వెయిటింగ్ లో పెడితే పోస్టింగ్ ఇవ్వగానే మొత్తం జీతం చెల్లించాలి. ఇప్పుడు వెయిటింగ్ లో వున్న వారు ఆరేడు నెలలుగా జీతాలు లేకుండా వున్నారు. ఈ లోపు ఆర్థిక శాఖ మూడు నెలలు దాటితే జీతాలు ఇచ్చేది లేదని తేల్చడంతో వీరిలో ఎవరైనా కోర్టు మెట్లెక్కితే ప్రభుత్వం పరువు పోతుందని వెయిటింగ్ లో వున్న వారికి పోస్టింగ్ లు ఇచ్చారని భావిస్తున్నారు. ఎవరు అధికారంలో వున్నా కొందరు కీలక స్థానాల్లో వుంటారు. ప్రభుత్వం మారిన తర్వాత ఏదో స్థానంలో ఏ అధికారికైనా పోస్టింగ్ ఇవ్వాలి. ప్రస్తుతం ప్రభుత్వంలో ఇది కొరవడింది. అందుకే కోర్టుల వద్ద ఎదురు దెబ్బలు తినాలసి వస్తోంది. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకోవడం శుభ సూచికం.