రాజకీయాల్లో చంద్రబాబు ఎన్నో ఎత్తులు వేసి మూడు సార్లు సీఎం అయ్యారు. అలాంటి చంద్రబాబు ఎత్తులను చిత్తు చేసి వైఎస్ జగన్ 151 సీట్లతో సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున భారీ మెజార్టీతో గెలుపు జెండా ఎగురవేశాడు. ఘనమైన చరిత్ర ఉన్న టీడీపీ పునాదులను సైతం కదిలించారు. మరి ఈ ఏడాదిలో జగన్ సాధించింది ఏమిటి ? జగన్ పాలన ఎలా సాగింది ? జగన్ తన ఎన్నికల మ్యానిఫెస్టోని ఎలా అమలు చేస్తున్నాడు ? లాంటి విషయాల పై ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం అయినా, క్లుప్తంగా చెప్పుకుంటే ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగానే జగన్ ముందుకు వెళ్తున్నాడనేది మెజార్టీ ప్రజల మనోగతం.
అయితే జగన్ నిర్ణయాలు కొన్ని వివాదాస్పదం అయినా, వెనక్కి తగ్గకుండా తనకు మంచి అనిపించింది చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. రాజకీయ ప్రత్యర్థుల విషయంలోనూ జగన్ అదే ధోరణిని ప్రదర్శిస్తుండటం జగన్ తెగువుకి నిదర్శనం. ఎవరితో అయినా ఢీ కొట్టడానికే జగన్ మొగ్గు చూపుతున్నాడు. కరోనా వైరస్ వంటి కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రతిపక్షాలకు మరో అవకాశం ఇవ్వట్లేదు. పదేళ్ల పాటు కష్టనష్టాలను అనుభవించి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే రికార్డ్ అయితే, కేవలం ఏడాది పాలనలోనే తనకంటూ ప్రత్యేకత సాధించిందం అనేది ఒక్క జగన్ కే సాధ్యమైంది.
నిజానికి పడి లేచే కడలి తరంగం లాంటిది చంద్రబాబు రాజకీయ జీవితం. కానీ జగన్ ముందు బాబు పూర్తిగా ఇంకిపోయిన నీరులా అయిపొయింది బాబు పరిస్థితి, మొత్తానికి బాబుకి ఎత్తులు పోయి జగన్ విషయంలో ఆయనకు లోతులు మాత్రమే మిగిలాయి. ఏమైనా జగన్ ఆలోచన అంత తొందరగా అందదు. జగన్ వ్యూహామే ఓ పద్మవ్యూహం.