అత్యంత భారీ ప్రాజెక్ట్ నుంచి అమరావతి ఔట్!

మూడు రాజధానుల ఏర్పాటు వల్ల అమరావతికి ఎలాంటి అన్యాయం జరగదు.. శాసన రాజధానిగా అమరావతిని అభివృద్ది చేస్తాం.. అన్న జగన్ సర్కార్ వాగ్దానాలు మాటల్లో ఓ రకంగా చేతల్లో మరో రకంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమరావతిలో అనేక నిర్మాణాలు ఆగిపోయాయి. ఉద్యమాలతో, ఇక్కడ నెలకొన్న పరిస్థితులతో అనేక ప్రాజెక్టులు ఆగిపోయాయి.. అభివృద్ధి పనులు పడకేశాయి.. తాజాగా ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుండి కూడా అమరావతిని తొలగించేందుకు జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న అనంతపురం-అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ ప్రెస్ వే నుంచి ఇప్పుడు అమరావతిని తొలగించేందుకు సన్నాహాలు పూర్తైనట్లు సమాచారం. భూసేకరణ సమస్యగా మారిందని, అంతటి భారాన్ని మోయలేమన్న సాకుతో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌ వే నుండి అమరావతి తప్పించి గుంటూరు జిల్లా చిలకలూరిపేట వరకే పరిమితం చేయాలని ప్రాజెక్టు పురోగతిపై సమీక్షించిన జగన్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసేసుకుందని తెలుస్తోంది. అలైన్‌మెంట్‌ మార్చాలని, చిలకలూరిపేట వరకే రహదారిని అనుసంధానించాలని స్పష్టంగా అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చిందట.

అలాగే ఎక్స్ ప్రెస్ వే రహదారిని చిలకలూరిపేట వరకు నిర్మించి ఆ తర్మాత చిలకలూరిపేట మీదుగా వెళ్లే ఎన్‌హెచ్‌-16 కు బైపాస్ ద్వారా కలపాలని కూడా ఆదేశించినట్లు వినబడుతోంది. ఇలా చేయడం ద్వారా అమరావతిని తప్పించడం ఒకటైతే ఎక్స్ ప్రెస్ ను చిలకలూరిపేట బైపాస్‌కు కలిపి రాయలసీమ ప్రాంతం నుండి వచ్చే వాహనాలు ఎన్ హెచ్ -16 ద్వారా విశాఖ వెళ్లడానికి వీలుగా ఉంటుందన్న ఆలోచనతోనే జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట.

ఎక్స్ ప్రెస్ వే ప్లానింగ్ ప్రకారం.. అనంతపురం జిల్లా మర్రూరు నుంచి చిలకలూరిపేట, ప్రత్తిపాడు, ఫిరంగిపురం ప్రాంతాల నుంచి తాడికొండ మండలం పెద్దపరిమి దాకా రహదారిని నిర్మించాల్సి ఉంది. అందులో కర్నూలు, కడప నుంచి దానికి కలిసే రహదారులను మినహాయిస్తే కొత్తగా నిర్మించాల్సినది 394 కిలోమీటర్ల రహదారి. ఇందుకోసం 28 వేల ఎకరాల భూమి సేకరించాలని, అందుకోసం 2.5 వేల కోట్లు వ్యయమవుతుందని అంఛనాలు కూడా సిద్ధం చేశారు. అయితే ఇప్పుడు ఈ వ్యయాన్నే బూచిగా చూపించి, అంత ఖర్చు చేయడం సాధ్యం కాదని అమరావతి వరకు ఎక్స్ ప్రెస్ వే రాకుండా వైసీపీ ప్రభుత్వం ప్రణాళికలు వేసిందన్నది చర్చనీయాంశమైంది.

ఓ వైపు న్యాయం చేస్తాము అంటారు.. మరో వైపు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.. మరి నిజంగా జగన్ ప్రభుత్వానికి అమరావతిని అభివృద్ది చేసే అలోచన ఉందా.. లేదా మూడు రాజధానుల కార్యక్రమం పూర్తయ్యే వరకు ఆ మాటలను అడ్డం పెట్టి అమరావతిని శాశ్వతంగా మరుగున పడేస్తారా అన్నది వారే చెప్పాలి.