శ్రీవారి ఆభరణాలన్నీ ఉన్నాయ్… టిటిడి క్లీన్ చిట్ మీద అనుమానాలు

 

(మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి)

తిరుమల తిరుపతి దేవస్థానాల(టిటిడి) మాజీ ప్రధాన అర్చకుడయిన  రమణదీక్షితుల ఆరోపణలతో శ్రీవారి ఆభరణాల నిర్వహణపై దుమారం చెలరేగింది. అటు ప్రభుత్వం, ఇటు టిటిడి లు కచ్చితమైన వైఖరిని అనుసరించకపోవడం, మరోవైపు దీక్షితులు కూడా పదే,పదే ఆరోపణలు చేయడంతో  సమస్య ఒక కొలిక్కి రావడం లేదు. ఈ సందర్బంలో బాధ్యతగా సంయమనంతో వ్యవహరించాల్సిన టిటిడి బోర్డు, అందులోని సభ్యులు వ్యవహరిస్తున్న తీరు సమస్యను ఇంకా జఠిలం చేస్తున్నది.

నిన్న బోర్డు సభ్యులు కొందరు ఆభరణాలను పరిశీలించినట్టు  అన్నీ సక్రమంగా ఉన్నట్లు ప్రకటించినారు. అంతవరకు బాగానే ఉన్నా కొందరు సభ్యులు చేసిన వ్యాఖ్యలు  ఆభరణాల నిర్వహణపై అనుమానాలను పెంచే విధగా ఉంది. రమణదీక్షితులు అన్యమతం వారి చేతిలో కీలు బొమ్మగా మారినారని ఒక సభ్యుడు రాజకీయ విమర్శలు చేశాడు.

మరి ఇదే ప్రభుత్వం అదే మతానికి చెందిన అనితను సభ్యులుగా చేర్చి తర్వాత ఉపసంహరించుకున్న విషయం గుర్తు లేకపోవడం విచిత్రం. ఇంకో సభ్యుడు ఆభరణాలు అన్నీ ఉన్నాయని దీక్షితులు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నట్లు ప్రకటించినారు. అదే సభ్యుడు రమణదీక్షితులు నగలను అపహరించినట్లు అనుమానం వ్యక్తం చేసినారు.  మరి దీక్షితులు నగలను అపహరించి ఉంటే అన్నీచెక్కుచెదరకుండా ఉన్నాయని ఎలా చెపుతారు?

మరో సభ్యుడు మాట్లాడుతూ శ్రీవారి నగలను ప్రద ర్శనకు  ఉంచడానికి ఆగమాలు అంగీకరించవని భవిష్యత్ లో కూడా శ్రీవారి నగలను భక్తులకు చూపమన్న అర్థం వచ్చేలా మాట్లాడారు. ఏ ఆగమాలు చెప్పినాయో టిటిడి విశదపరచాలి.

ఆభరణాలను ఉత్సవాలలో నాలుగు మాడా వీదులలో ప్రదర్శించడం లేదా? అసలు ఆగమాల కాలం ఎప్పటిది?  ఇన్ని నగలు కానుకలుగా వస్తాయని వాటిని ప్రదర్శించాలా  వద్దా అన్న అవగాహన ఆనాటికి ఎలా తెలుస్తుంది?  ఆగమాలుపై ఇంత గందరగోళం ఎందుకు?  ఆగమ శాస్త్రం ఏమిటో ప్రజల ముందు ఉంచితే ఏ పేజీలో ఏముందుకు చక్కగా చదువుకుంటారు. అయినాటిటిడి బోర్డు సభ్యులు ఎందుకు బోర్డు సమావేశానికి ముందురోజు ఆభరణాలను చూడాలి? వారితో బాటు ఆభరణాలపై అవగాహణ ఉన్న నిపుణునలను తీసుకుని వెల్లినారా లేదా అన్న విషయాలు నిజాయితీగా చెప్పాలి. టన్నుల కొద్ది ఉన్న ఆభరణాలను అంత స్వల్ప వ్యవదిలో ఎలా పరిశీలించినారు, అన్నీ ఉన్నాయని నిర్దారణకు ఎలా రాగలిగినారు? రాజకీయ అవగాహణ మినహ సాంకేతిక అవగాహణలేని సభ్యులు చూడగాలేనిది ఒక ఉన్నత స్థాయి సాంకేతిక పరిజ్ణానం కలిగిన  అధికారులను నియమించి ఇపుడు బోర్డు చేసిన పని వారితో చేయించి వాస్తవాలను ప్రజలముందు ఉంచితే సమస్యకు పరిష్కారం లబించి ఉండేది. టిటిడి బోర్డు సభ్యులు సమస్యను పరిష్కరించక పోతే పోయారు గాని కొత్త సమస్యలను తీసుకురాకుండా ఉంటే అదే పదివేలు.

 

(వ్యాస రచయిత రాయలసీమ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు)