లోకేష్, కేటీఆర్ ట్వీట్టర్‌లో పోటాపోటీ

వారిద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంల కొడుకులు. రెండు రాష్ట్రాల్లో కూడా వారి తండ్రుల తర్వాత స్థానం వారిదే. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటికే వారిద్దరు రాజకీయాలలో చాలా బిజీ అయిపోయారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. రాష్ట్రాలకు మీవల్లే అన్యాయం జరిగిందంటే మీ వల్లే అంటూ విమర్శించుకునే వారు.. ఈవోడీబీ ర్యాంకులతో ఒకరిపై ఒకరు అభినందనలు తెలుపుకున్నారు. ఇప్పుడా అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ వారెవరంటే ఏపీ మంత్రి లోకేష్ , తెలంగాణ మంత్రి కేటీఆర్. అసలు వారి ట్వీట్టర్ లో ఏమని అభినందించుకున్నారో మనమూ తెలుసుకుందాం…

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలుగు రాష్ట్రాలు మరోసారి తమ సత్తాను చాటాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాష్ట్రాల ర్యాంకింగ్ ను ప్రపంచ బ్యాంక్, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ పాలసీ అండ్ ప్రమోషన్ సంస్థలు సంయుక్తంగా నివేదిక రూపొందించి ర్యాంకులు ప్రకటిస్తాయి. తాజాగా ప్రకటించిన ఈ ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ 98.42 శాతం స్కోర్ తో ఫస్ట్ ర్యాంక్ సాధించగా, తెలంగాణ 98.33 శాతంతో రెండో ర్యాంక్ సాధించింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్ తమకు రెండో ర్యాంక్ వచ్చిన విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు. “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ)లో కేవలం 0.09% తేడాతో మేము మొదటి ర్యాంకును కోల్పోయాం. అయినా మంచి స్థానంలో నిలిచాం. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అధికారులు సమర్థవంతంగా పనిచేస్తూ ఈ ఏడాది కూడా మంచి ర్యాంకు సాధించేలా చేశారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈవోడీబీలో తొలి ర్యాంకు సాధించిన ఆంధ్రప్రదేశ్ కు అభినందనలు” తెలుపుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

కాగా.. కేటీఆర్ ట్వీట్ కు ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. “ ఇక్కడ ఒకటీ రెండు తేడా లేదు, తెలుగు రాష్ట్రాలు టాప్ లో నిలిచాయి. ఇది మన తెలుగు ప్రజల అభివృద్దికి దోహదపడుతుంది. మీకు కూడా అభినందనలు” అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఇద్దరు మంత్రులు ఒకరిపై ఒకరు చేసుకున్న ట్వీట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.