పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. గత కొన్నిరోజులుగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అండ్ ఆ పార్టీకి చెందిన నేతల పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించి ఒక్కసారిగా రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయ్యారు. మొదట రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలను లైట్ తీసుకున్న వైసీపీ నేతలు, ఇటీవల ఆయన విమర్శలు హద్దులు దాటడంతో, ఆ ఎంపీ పై ఎదురు దాడి ప్రారంభించారు.
జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచిన రఘురామ కృష్ణంరాజు రాజీనామా చేసి మళ్ళీ పోటీలోకి దిగి గెలవాలని సవాల్ విసిరారు. దీంతో మరోసారి స్పందించిన రఘురామ కృష్ణంరాజు తాను జగన్ జగన్ బొమ్మతో తాను గెలవలేదని, జగన్ బతిమాలితేనే పార్టీలోకి వచ్చానని, ముందు నరసాపురం నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే.. తాను కూడా రాజీనామా చేస్తానని ఘాటుగా స్పందించారు.
ఇక రఘురామ కృష్ణంరాజు వ్యవహారం పై ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న వైసీపీ అధిష్టానం తాజాగా స్పందించింది. ఈ క్రమంలో మీడియా ముందుకు వచ్చిన వైసీపీ ప్రధాన కార్యదర్శి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఇప్పటికే రఘురామ కృష్ణంరాజు గీత దాటి అర్ధంపర్ధం లేని విమర్శలు చేస్తున్నారని, ఇకముందు కూడా ఇలాగే అనవసరంగా విమర్శలు చేస్తే కఠిన చర్యలు తప్పవని వైసీపీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చింది.
అలాగే మరోవైపు రఘురామ కృష్ణంరాజు పై విమర్శలు చేస్తున్న వారు కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయోద్దని వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పింది. మరి వైసీపీ అధిష్టానం హెచ్చరికల్ని రఘురామ కృష్ణంరాజు పట్టించుకుంటారా లేక ఇకముందు కూడా విమర్శలు కొనసాగిస్తారా.. ఒకవేళ రఘురామ కృష్ణంరాజు మరోసారి విమర్శలు చేస్తే.. వైసీపీ అధిష్టానం ఆయన పై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆశక్తిగా మారింది.