ప్రజాప్రతినిధులకు, పోలీస్ అధికారులకు మధ్యన అప్పుడపుడు విభేదాలు రావడం సాధారణ విషయమే. కానీ అవి ఈగో సమస్యగా మారితేనే ప్రమాదం. ప్రస్తుతం నెల్లూరు జిల్లా బుచ్చిలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. కోవూరు వైకాపా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి జిల్లా ఎస్పీకి మధ్యన మెల్లగా మొదలైన విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కొన్నిరోజుల క్రితం ప్రసన్న కుమార్ రెడ్డి స్థానిక ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన కొందరు అధికారుల్ని కూడా ఆహ్వానించారు.
కానీ ఎస్పీ భాస్కర్ భూషణ్ లాక్ డౌన్ సమయంలో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం ఏమిటని మండిపడుతూ ప్రసన్న కుకుమార్ రెడ్డితో పాటు కార్యక్రమానికి వెళ్లిన ఇంకొందరు అధికారులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తే కేసులు పెడతారా, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటూ నేరుగా పోలీస్ స్టేషన్లోకి వెళ్లి సవాల్ చేశారు.
అంతేకాదు తాను ఎవ్వరినీ లెక్కచేయనని, కలెక్టర్, ఎస్పీ తమ మర్యాద కాపాడుకోవాలని, కార్యక్రమానికి వచ్చిన అధికారులకు ఎమైనా ఇబ్బంది కలిగితే ఒప్పుకునేది లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ వివాదం చల్లారేలోపే తాజాగా ప్రసన్న కుమార్ రెడ్డి స్థానికులకు రంజాన్ తొఫా పేరుతో సరుకులు అందించారు. ఈ కార్యక్రమాన్ని ఏఎస్ఐ ఫొటోలు తీశారు. దీంతో ప్రసన్న కుమార్ అనుచరులు ఏఎస్ఐ ఫోన్ లాగేసుకున్నారు. ఈ విషయంపై సదరు పోలీస్ అధికారి ప్రసన్న కుమార్ రెడ్డిని ఫోన్ ఇవ్వను.. ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో. అసలు మీ సేవలే మాకు అక్కర్లేదు అంటూ ఫైర్ అయ్యారు. దీంతో ఏఎస్ఐ ఉన్నతాధికారులకు పిర్యాధు చేశారు. వారు ఎమ్మెల్యే ఇలా పోలీసుల విధులకి అడ్డు తగలడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మంత్రుల వరకు వెళ్లిన ఈ పంచాయితీ అక్కడే తెగుతుందో లేకపోతే ఇంకా ముదిరి పాకాన పడుతుందో చూడాలి.