పోలవరం నిర్మాణంపై లెక్కలు తేల్చిన కేంద్రం

Polavaram

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ఎన్నో అపోహలు రేగుతున్నాయి. ప్రాజెక్టు ఆగిపోయిందని, నిర్మాణ పనులు కూడా సాగడం లేదని పుకార్లు షిరాకు చేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా పోలవరం పనులపై క్లారిటీ ఇచ్చింది. పార్లమెంట్ సమావేశాల్లో పోలవరం ప్రాజెక్ట్‌ను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు..? అన్న టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్నకు కేంద్రమంత్రి షెకావత్ సమాధానమిచ్చారు. లెక్కల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి సమాధానం లేదని అన్నారు.

2021 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పార్లమెంటులో తెలిపిన షెకావత్.. ఫిబ్రవరి నాటికి పోలవరం నిర్మాణం 69.54 శాతం పూర్తయింది.. అలాగే వందశాతం పోలవరం ప్రాజెక్ట్‌ ఖర్చును కేంద్రమే భరిస్తుంది.. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో రూ.8, 614.16 కోట్లు ఏపీకి తిరిగి చెల్లించిందని లెక్కలు చెప్పారు.

అలాగే గత నెలలో రూ.1850 కోట్లు కేంద్రం విడుదల చేసి ఖర్చు, ఆడిట్‌ నివేదికలు ఇవ్వాలని 2018, 2019లో లేఖలు రాసినా ఆ రెండు లేఖలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించలేదట. మరి పోలవరం నిర్మాణం త్వరిత గతిన పూర్తి చేయడంపై ఎంతో చిత్తశుద్ధితో ఉన్నామని పదే పదే స్పష్టం చేసిన జగన్ ఇప్పటికైనా పార్లమెంటులో కేంద్రం లేవనెత్తిన ఈ అంశంపై సమాధానమిస్తే పోలవరం నిర్మాణంపై ఉన్న అపోహలు కూడా తొలగిపోతాయి.