‘నిమ్మగడ్డ’ చివరి మాట జగన్ గురించేనా ?

 
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ తొలగింపుకు సంబంధించి, ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ ను ఈ రోజు  హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. కాగా హైకోర్టు తీర్పు పై  ఎస్ఈసీ రమేష్ కుమార్ స్పందిస్తూ.. ‘హైకోర్టు ఆదేశాల మేరకు తాను వెంటనే బాధ్యతలు స్వీకరిస్తున్నానని, అలాగే  తాను తన బాధ్యతలను నిష్పక్షపాతంగా, అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తానని, దీని కోసం అన్ని పార్టీలతో పాటు భాగ్వస్వాములు అందరితో చర్చిస్తానని, సాదారణ పరిస్థితులు నెలకొన్న వెంటనే పని ప్రారంభిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.   ఇంతవరకూ బాగానే ఉంది గాని, ఆయన అన్న మరోమాట వైసీపీ వాళ్లకు కాస్త ఇబ్బంది కలిగించేలా ఉందట.  
 
రమేష్ కుమార్ అన్న ఆ మాట ‘వ్యక్తులు శాశ్వతం కాదని, వ్యవస్థలు వాటి విలువలే శాశ్వతం అని అన్నారు.  ఈ చివరి మాట జగన్ ను ఉద్దేశించి ఆయన అన్నారేమో అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.  ఏమైనా  రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరు  ఆయా పదవుల ప్రతిష్టను, సమగ్రతను కాపాడాలి గాని, అనవసరపు పంతాలకు పట్టుదలకు పోయి  పదవుల ప్రతిష్టను దిగజార్చడం అనేది ఎప్పటికీ హర్షించతగినిది కాదు.
 
ఇక రమేష్ కుమార్ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దాఖలైన 11 పిటిషన్లను సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు.. ఎట్టకేలకూ ఆర్డినెన్స్ కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆర్డినెన్స్‌ కు అనుబంధంగా తీసుకొచ్చిన నాలుగు జీవోలను కూడా కొట్టివేయడం జరిగింది.  పదవిలో ఉన్న వ్యక్తికి వర్తించేలా కొత్త నిబంధనలు తీసుకురావడం అనేది సరికాదని ఈ సందర్భంగా హైకోర్టు అభిప్రాయపడింది.