దేశంలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళనలు రేకెత్తిస్తోంది. దేశమంతా లాక్ డౌన్‌తో పాటు అన్ని రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలకు దిగిన కట్టడి కష్టతరంగా మారుతున్న తరుణంలో అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసేస్తున్నాయి. అయితే ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలతోపాటు ప్రజల సహకారం కూడా ఉంటేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందన్నది కొన్ని రాష్ట్రాల్లో ప్రస్ఫుటమవుతుండగా, ఏ చిన్న తప్పిదమైనా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని, ఏమరపాటు తగదని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కరోనా కేసులు 12కి చేరుకున్నాయి. నమోదైన కేసులు ఇతర రాష్ట్రాలతో పోల్చితే తక్కువగానే ఉన్నా.. కరోనాని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు సమర్థవంతంగా లేవంటూ విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఘాటుగా విమర్శించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అధికార పక్షం లోపాలను ఎత్తిచూపుతోన్న ఆయన కరోనా విషయంలోనూ వివిధ అంశాలపై ట్విటర్లో స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్వాకం వల్ల వేల మంది బాధలు పడుతున్నారని ఆరోపణలు చేశారు.
సరైన సమాచారం లేకుండా విద్యార్థులను తెలంగాణ పంపండంపై స్పందిస్తూ.. విద్యార్థులను ఆకలి దప్పికలతో చంపవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పనిలో పనిగా.. హైదరాబాద్ టీసీఎస్‌కు చెందిన 13 మంది యువతులు కర్ణాటక – కేరళ సరిహద్దులో చిక్కుకున్నపుడు కేరళ సీఎం స్పందించిన తీరును కూడా కేశినేని నాని ప్రస్తావించారు. ఆయనను చూసి నేర్చుకోవాలంటూ జగన్‌కు సూచించారు. అయితే ఓ ఎంపీ.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ నేతలంగా ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఈ సమయంలో కూడా రాజకీయ ప్రయోజనాలేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.