జగన్ ‘ఈ-మార్కెటింగ్‌’ రైతులకు వరం !

 
ఆంధ్రప్రదేశ్ లో పంటల ప్రణాళిక, అలాగే పంటల  ఈ-మార్కెటింగ్‌ ఫ్లాట్‌ ఫామ్ పై  జగన్‌ ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఈ- క్రాపింగ్‌ మీద సమగ్ర విధివిధానాలను, వెంటనే తయారుచేయాలని అధికారులను ఆదేశించారు.  వైయస్సార్‌ రైతు భరోసా కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని దాని పరిధిలో ఏయే పంటలు వేయాలన్న దాని పై పంటల ప్రణాళికను సిద్ధం చేయాలని,   ఏయే రైతు ఏ పంట వేస్తున్నారన్న దాని పై కూడా  ఈ- క్రాపింగ్‌ కోసం విధివిధానాలను మరింత సమగ్రంగా తయారుచేసి, వాటిని వైయస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు.
 
జగన్ చేసిన ఈ పని వల్ల రైతులకు నిజంగా మేలు జరుగుతుంది. ఇన్నాళ్లు మార్కెటింగ్‌ చేయలేని పంటలు వేసి రైతులు నష్టపోయారు. రైతులకు ఇంకా మేలు జరగాలంటే.. ముందుగా  రైతు భరోసా కేంద్రాలు  పరిధిలో  ఏ పంటలు వేయాలన్న దాని పై మ్యాపింగ్‌ చేయాలి. జిల్లా, మండల స్థాయిల్లో అగ్రికల్చర్‌ సలహా బోర్డులను వెంటనే ఏర్పాటు చేసి రైతులను గైడ్ చెయ్యాలి. అన్నిటికంటే ముఖ్యంగా  పంటల ప్రణాళికకు అనుగుణంగా విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడాలి.  అప్పుడే  రైతులు పండించిన పంటలకు విలువ ఉంటుంది. 
 
ఎలాగూ ఇప్పటికే పంటలను విక్రయించేందుకు ఈ-ప్లాట్‌ ఫాంను కూడా సిద్ధంచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. పైగా జగన్  ప్రభుత్వం 30 శాతం పంటలను కొనుగోలుచేయాలని నిశ్చయించింది. అలాగే  మిగతా 70 శాతం పంట కూడా అమ్ముడయ్యేలా జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.  దీనికోసమే  ఈ- మార్కెటింగ్‌ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామస్థాయిలో గ్రేడింగ్, ప్యాకింగ్‌ సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.  ఈ- మార్కెటింగ్‌ పద్దతిలో పంటను అమ్మాలంటే నాణ్యత అనేది చాలా ముఖ్యం. అందుకే జగన్‌  గ్రేడింగ్, ప్యాకింగ్, ప్రాసెసింగ్‌ పై దృష్టి పెట్టారు.  ఈ ఖరీఫ్‌ పంట చేతికి వచ్చే సమయానికి గ్రేడింగ్, ప్యాకింగ్ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. జగన్ ప్లాన్ చేసిన  ఈ-మార్కెటింగ్‌ ఫ్లాట్‌ పామ్  రైతులకు గొప్ప  వరంలా మారనుంది.