ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని మార్పులో భాగంగా.. వెలగపూడిలోని విజిలెన్స్ కమిషన్ కార్యాలయం, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 13ను హైకోర్టు సస్పెండ్ చేసింది.
సెక్రెటేరియట్లో భాగంగా ఉన్న ఈ కార్యాలయాలను న్యాయపరమైన విభాగాలుగా పేర్కొంటూ కర్నూలుకు తరలించేందుకు ప్రభుత్వం జీఓ జారీ చేసిన నేపథ్యంలో.. ఆ జీవోలో సీఎస్ సంతకం లేకపోవడం ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటూ రాజధాని పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలకు జారీ చేసిన జీవో సస్పెండ్ చేసింది. స్థలాభావం వల్ల తరలిస్తున్నట్లు ప్రభుత్వ తరపు న్యాయవాది పేర్కొనగా స్థలాభావం ఉంటే మరోచోట ఏర్పాటు చేయాలని, ఇలా తరలించడం వల్ల ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే అప్పట్లో ధర్మాసనం ఈ తీర్పును రిజర్వులో పెట్టింది. వాదనల అనంతరం శుక్రవారం తీర్పును వెలువరించింది.
మొత్తంగా రాజధాని వికేంద్రీకరణలో కీలక ప్రక్రియగా ప్రభుత్వం భావిస్తోన్న హైకోర్టు కార్యాలయాల తరలింపుకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా హై కోర్టు తరలిస్తే.. ఇతర ప్రభుత్వ కార్యాయాలను కూడా విశాఖకు తరలించి రాజధాని మార్పు ప్రక్రియను పూర్తి చేయొచ్చని ప్రభుత్వం భావిస్తుంటే… ఆదిలోనే అడ్డంకులు తలెత్తుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో రాజధాని మార్పుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.