కత్తి మ‌హేష్‌పై నాగబాబుకు ఎందుకంత కసి?

గతంలో పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు కత్తి మహేష్. కత్తి మహేష్ క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా అతనిని వదలలేదు పవన్ అభిమానులు. అనేకరకాల ఇబ్బందులకు గురి చేసారు. ఫోన్ కాల్స్, మెసేజెస్ తో అతనిని బెదిరించారు కూడా. మా దేవుడిని అంటే ఊరికే వదిలిపెట్టము అంటూ అతనిపై దాడికి దిగారు.. ఈ విషయంలో మెగా హీరోలు కూడా కత్తి మ‌హేష్‌పై మండిపడ్డారు. అయితే ఈ వివాదం వలన పవన్ రాజకీయ భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతుందని భావించి రాజీ కుదుర్చుకున్నారు. దీనితో ఆ వివాదం అప్పటితో సర్దుమణిగింది అనుకున్నారు అందరు.

తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నాడు కత్తి మహేష్. పగ తీర్చుకోటానికి ఇదే సరైన సమయం అనుకున్నాడో ఏమో వెంటనే ఎంట్రీ ఇచ్చేసాడు నాగబాబు. ఒక టీవీ చర్చలో రామాయణం గురించి, రాముని గురించి కత్తి చేసిన కామెంట్స్ తిరిగి అతని మెడకే చుట్టుకున్నాయి. హిందూ సంఘాలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. పోలీసులు కత్తి మహేష్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా ఇలా ఉండగా గతంలో తన తమ్ముడిపై కత్తి చేసిన దాడి నాగబాబు ఇంకా మర్చిపోయినట్టు లేడు. కక్ష సాధింపు చర్యగా కత్తి మహేష్ తీరును నిరసిస్తూ ఒక వీడియో పోస్ట్ చేసాడు.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విషయంపై స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని లేదంటే చారిత్రిక తప్పిదం చేసినట్టే అవుతుందని సూచించారు. పోలీసులు ఈ విషయాన్ని ఈజీగా తీసుకుంటే ప్రజలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇవన్నీ పవన్ అభిమానులను, ప్రజలను మరోసారి కత్తి మహేష్ పై ఉసిగొల్పేందుకే యత్నిస్తున్నట్టున్నాయని పలువురు విమర్శకుల నోటి నుండి వినిపిస్తున్న మాట.