మంచు విష్ణు, ఓటర్లను బాగానే రప్పించాడే.!

జెనీలియా ముంబై నుంచి వచ్చింది.. జయప్రద ఢిల్లీ నుంచి వచ్చారు. ఈసారి ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల కోసం పొరుగు రాష్ట్రాల నుంచి సినీ నటులు బాగానే వచ్చారు. వీరందరికీ ‘మా’లో సభ్యత్వం వుంది. ‘మా’ సభ్యులుగా ఓటేయడానికి వచ్చిన చాలామంది ప్రస్తుతం సినిమాల్లో అంత యాక్టివ్‌గా లేరు.

పర భాషల నుంచి నటీనటుల్ని రప్పించి ఓట్లేయించుకుంటారుగానీ, ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో తెలుగు నేల మీద స్థిరపడ్డ ఓ పరభాషా నటుడు మాత్రం పోటీ చేయకూడదంటారు. ఆత్మగౌరవం అప్పడాల కర్ర.. ఇవన్నీ ఎన్నికల ప్రచారం కోసం మాట్లాడే మాటలు మాత్రమే.

ఇదిలా వుంటే, పొరుగు రాష్ట్రాల నుంచి సభ్యుల్ని రప్పించి, వారితో ఓట్లేయించడంలో మంచు ముఠా.. అదేనండీ మంచు శిబిరం బాగానే సక్సెస్ అయ్యింది. అయితే, ఆ ఓట్లు ఎవరికి పడ్డాయన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

దాదాపుగా తాము పిలిచినవారంతా వచ్చారన్న గట్టి నమ్మకంతో, వాళ్ళంతా తమకే ఓటేశారన్న గట్టి నమ్మకంతో.. ‘మేమే గెలవబోతున్నాం..’ అని మంచు క్యాంప్ అంటోంది. అది నిజమేనా.? కాస్సేపట్లో ఫలితమేంటో తెలిసిపోతుంది లెండి.