జబర్ధస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ కి పితృ వియోగం.. శోకసంద్రంలో కుటుంబం!

ఈటీవీలో ప్రసారమవుతున్న అనేక కామెడీ షోలతో ఎంతోమంది కమెడియన్లుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇలా ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పటాస్ కామెడీ షో ద్వారా గుర్తింపు పొందిన ప్రవీణ్ కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు. అంతేకాకుండా గత కొంతకాలంగా జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ లో సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల ప్రవీణ్ తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. తండ్రి మరణంతో ప్రవీణ్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

గత కొంతకాలంగా ప్రవీణ్ తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ప్రవీణ్ తండ్రి ప్రాణాంతకమైన బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి బారిన పడటంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు చికిత్స చేసినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోగా మరింత క్షీణించింది. అది ఆయన చివరి దశ అని డాక్టర్లు చెప్పకనే చెప్పారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మంగళవారం ప్రవీణ్ తండ్రి కన్నుమూశాడు. తండ్రిని బ్రతికించుకోవడానికి ప్రవీణ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తన తండ్రిని కాపాడుకోలేకపోయాడు.

చిన్న వయస్సులోనే తల్లిని కోల్పోయిన ప్రవీణ్.. ఇప్పుడు తండ్రి కూడా దూరమయ్యి ఒంటరిగా మిగిలిపోయాడు. తండ్రి మరణంతో ప్రవీణ్ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. తన తల్లి చిన్నప్పుడే చనిపోయినా తన తండ్రి తల్లి లేనిలోటు తెలియకుండా ఇద్దరు కొడుకులను పెంచి పెద్ద చేశారు. ప్రవీణ్ తండ్రి మరణం పట్ల జబర్దస్త్ ఆర్టిస్టులో సంతాపం తెలియజేస్తున్నారు. కామెడీ షోలలో తన పంచ్ లతో అందరిని కడుపుబ్బా నవ్వించే ప్రవీణ్ ఇలా తల్లి తండ్రిని పోగొట్టుకొని ఒంటరిగా మిగిలిపోయాడు.