మనం చూసేది నిజం కాదు. బయటకు కనిపించేదాంట్లో వాస్తవం ఉండదు. నవ్వించే వాడి జీవితంలో అన్ని నవ్వులే ఉంటాయని చెప్పలేం. అసలు కష్టాలు, బాధలు అందర్నీ నవ్వించే వాడి జీవితంలోనే ఉంటాయి. మరోసారి అది అవినాష్ విషయంలో నిజమైంది. జబర్దస్త్ అవినాష్ ఏ సందర్భంలో బిగ్ బాస్‌కు వెళ్లాడో, ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తాజాగా బయటకు వచ్చింది. బిగ్ బాస్‌లో మార్నింగ్ మస్తీలో భాగంగా అవినాష్ తన బాధలన్నీ చెప్పుకొచ్చాడు.
ఇంటి ఈఎంఐ 45 వేలు కట్టలేని పరిస్థితులు వచ్చాయని, ఆర్టిస్ట్‌లమైన మనం మనకు డబ్బులు లేకపోయినా మన ప్రేక్షకులు, అభిమానులకు పెట్టాల్సి వస్తుందని ఈ లాక్ డౌన్‌లో సూసైడ్ చేసుకోవాలని అనుకున్నానని అవినాష్ తెలిపాడు. ఇళ్లు కడదామని ముందుగానే అడ్వాన్స్ ఇచ్చానని, ఇంటి కోసం పెట్టుకున్న డబ్బులన్నీ హాస్పిటల్‌కు పెట్టానని పేర్కొన్నాడు. నాన్నకు గుండెలో మూడు స్టంట్స్‌లు వేయాల్సి వచ్చింది.. దాని కోసం నాలుగు లక్షలు ఖర్చు అయిందని తెలిపాడు.
అదే సమయంలో అమ్మకు మోకాళ్ల చిప్పలకు ఆపరేషన్ చేయించాను.. దాదాపు 13, 14 లక్షల అప్పు అయింది. ఇక ఇంటి ఈఎంఐలు కట్టలేకపోయాను. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. అయితే నేను లేకపోతే అమ్మ నాన్నలకు కష్టమొస్తే ఎవరు ఆదుకుంటారు? వారిని ఎవరు చూసుకుంటారు అని ఆగిపోయాను. అమ్మనాన్నలు లేనప్పుడు వారి విలువ తెలుస్తుంది.. దయచేసి వారిని వృద్దాశ్రమంలో చేర్చకండి అంటూ అవినాష్ తన లైఫ్‌లో ఎదుర్కొన్న కష్టాలను తెలిపాడు. ఈ లాక్ డౌన్ వల్ల ఏర్పడిన నష్టాలను బిగ్ బాస్ రెమ్యూనరేషన్‌తో పూడ్చేందుకు షోలోకి వెళ్లాడని ఇప్పుడు అందరికీ అర్థమైంది.