‘నేను విన్నాను.. నేనున్నాను’

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌ రెడ్డి జీవితంలో ముఖ్య ఘట్టం అయిన పాదయాత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘యాత్ర’. ఈ బయోపిక్ లో మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైయస్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ఈ రోజు విడదలైంది.

వైఎస్సార్‌ కుమారుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను చిత్ర యూనిట్‌ నేడు విడుదల చేసింది. రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలను వైయస్ దృష్టికి తీసుకువచ్చే సన్నివేశం ట్రైలర్‌ ప్రారంభమైంది. ఆ రైతు కష్టాలు చూసి చలించిన వైయస్ పాతయాత్రకు శ్రీకారం చుట్టినట్లుగా టీజర్ సాగింది. మీరూ ఇక్కడ ఆ టీజర్ ని చూడవచ్చు

‘నీళ్లు ఉంటే కరెంట్‌ ఉండదు.. కరెంట్‌ ఉంటే నీళ్లు ఉండవు.. రెండు ఉండి పంట చేతికస్తే సరైన ధర ఉండదు.. అందరు రైతే రాజు అంటారు.. సరైన కూడు, గుడ్డ, నీడ లేని ఈ రాచరికం మాకొద్దయ్య.. మమ్మల్ని రాజులుగా కాదు.. కనీసం రైతులుగా బతకనివ్వండి’ అంటూ రైతు తన ఆవేదనను వైయస్ తో పంచుకోవటం మన మనస్సుని చలింపచేస్తుంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర రోజులని క్షణమాత్రమైనా గుర్తు చేయగలగటం ఈ టీజర్ ప్రత్యేకత.

Yatra Movie Official Teaser (Telugu) | Mammootty | YSR Biopic | Mahi V Raghav | 70MM Entertainments

ఇక ట్రైలర్‌ చివర్లో మమ్ముట్టీ పలికే.. ‘నేను విన్నాను.. నేనున్నాను’ మాటలు హైలెట్ గా ఉన్నాయి.ముమ్ముట్టి లుక్, గెటప్ … వైఎస్సార్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారా అనిపించేలా డిజైన్ చేసారు.

జగపతిబాబు, సుహాసిని, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను 2019 ఫిబ్రవరి 8న యాత్ర సినిమా రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ మళయాల భాషల్లోనూ యాత్ర సినిమా రిలీజ్‌ అవుతోంది. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు.