ఖైదీ నుంచి సైరా వరకూ మెగా జర్నీ
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ `సైరా: నరసింహారెడ్డి` అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. మరో 18 రోజులే సమయం మిగిలి ఉంది. ఈనెల 18న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు రాజమౌళి-పవన్ కల్యాణ్ విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. చివరి నిమిషంలో రకరకాల కారణాలతో తెరాస మంత్రి కేటీఆర్ ఈ వేడుకకు రాలేకపోతున్నారని తెలిసింది.
తాజాగా సైరా టీమ్ ఓ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ
సినిమాని ఇదే అక్టోబర్ లో రిలీజ్ చేశామని టీమ్ హైలైట్ చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 28 అక్టోబర్ 1983 – ఒక సాధారణ హీరో, నెంబర్-1 గా చరిత్ర సృష్టించిన రోజు… 02 అక్టోబర్ 2019 – మరుగున పడిన ఒక గొప్ప యోధుడి కథతో చరిత్ర సృష్టించబోయే రోజు…! అంటూ సెంటిమెంటును రంగరించారు. తెలుగు కళామ్మా తల్లి ముద్దు బిడ్డ వస్తున్నాడు అంటూ మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ లో వేడి పెంచారు. అయితే ఖైదీ సెంటిమెంట్ సైరాకు ఎలా వర్కవుటవుతుంది అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ నాలుగు దశాబ్ధాల కెరీర్ లో ఖైదీ నుంచి సైరా మధ్యలో మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయి. ఎన్నో క్లాసిక్ హిట్లు.. రికార్డులు ఉన్నాయి. అయితే సైరా వీటన్నిటినీ బీట్ చేసి రికార్డులు తిరగరాస్తుందా అన్నది చూడాలి.
ఇదంతా చెప్పుకోవడానికి బాగానే ఉంది .. అయితే రిలీజ్ కి ఇంకో 18రోజులే ఉండగా అసలు 300 కోట్ల బడ్జెట్ సినిమాగా చెబుతున్న సైర హడావుడి లేదన్న నిరాశ అభిమానుల్లో ఉంది. ప్రభాస్ సాహో చిత్రానికి చేసిన ప్రచారంతో పోలిస్తే ఈ ప్రచారం తీసికట్టుగానే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు సైరా ప్రమోషనల్ షెడ్యూల్ ఏమిటన్నదానిపైనా క్లారిటీ రాలేదు. ప్రీరిలీజ్ వేడుకలోనే ట్రైలర్ ని లాంచ్ చేస్తున్నారు. అటుపై మెట్రోల్లో ప్రమోషన్ ఎలా ఉండనుంది? అన్నది తెలియాల్సి ఉంది.