దేశ రాజధానిలో జైపాల్ రెడ్డి అవసరం మళ్లీ వచ్చింది. ఆయన్ని ఢిల్లీకి మళ్లీ రప్పించడం వెనక ఒక పెద్ద ప్లానుందని కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ గా ఆయన్ను నియమంచి ఢిల్లీకి రప్పించుకోవడం మీద రకరకాల చర్చలు మొదలయ్యాయి. కొందరేమో ఇది డిమోషన్ అని, ఇంకొందరేమో కాదు, ఇది ప్రమోషన్ అని తర్కించుకుంటున్నారు.
అయితే, ఢిల్లీ రాజకీయాలతో బాగా పరిచయం ఉండి, 24, అక్బర్ రోడ్ తోనే కాకుండా 10 జనపత్ తో సంబంధాలున్న సీనియర్ నాయకుడొకరు ఈ విషయం గురించి వాకబు చేసిన ‘తెలుగు రాజ్యం’కు ఒక ఆసక్తి కరమయిన విషయం వెల్లడించారు. 2019 ఎన్నికల తర్వాత యుపిఎ పరిపాలన వస్తే జైపాల్ రెడ్డిని రాష్ట్ర పతి చేసే అవకాశాలున్నాయని అయన చెప్పారు.
హైదరాబాద్ లో కూర్చున్నవాళ్లకు జైపాల్ రెడ్డి స్టేచర్ అర్థంకాదు. తెలుగు రాష్ట్రాలనుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు వున్న నాయకులెవరైనా ఉంటే వాళ్లలో జైపాల్ రెడ్డి ఒకరు.
ఇపుడు రాహుల్ గాంధీ పథకం ఒక్కటే. బిజెపిని అధికారం నుంచి తరిమేయాలి. గోరక్షణ పేరుతో కొంతమంది అల్లరి మూకలు నరమేధానికి పాల్పడుతున్నా, ఇదే మూకలు మానభంగాలు చేస్తున్నా ప్రధాని మోదీకి చీమకుట్టినట్లు లేదని. అందుకే ఆయన ఇలాంటి ప్రధానిని గద్దె దించాలని రాహుల్ పిలుపునిచ్చారు. దీనికి ప్లాన్ వేస్తున్నారు. దీనికోసం యోగ్యలయిన వారందరిని ఢిల్లీకి రప్పిస్తున్నారు. ఇందులో భాగమే జైపాల్ నియామకమని ఈ సీనియర్ నాయకుడు భావిస్తున్నారు.
జైపాల్ బిజెపికి బద్ధ శత్రువు. ఎన్ డిఎ హయాంలో ఆయన వాజ్ పేయి కి వ్యతిరేకంగా చేసిన ప్రసంగాలు వాజ్పేయి ఎప్పటికీ మర్చిపోలేరు.
కరుడు గట్టిన కాంగ్రెస్ వాది అనుకుని ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతి చేశారు. ఆయన తన దారిని తాను వెళ్లిపోయారు. ఇది కాంగ్రెస్ ను నిరుత్సాహపరిచింది. చివరకు ఆ మధ్య ఆయన ఏకంగా ఆర్ ఎస్ ఎస్ సమావేశానికి కూడా వెళ్లారు.
ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజీ లేని బిజెపి వ్యతిరేకిని రాష్ట్రపతి చేసే అవకాశం ఉందని, దీనికి యోగ్యుడు జైపా రెడ్డి ఈ సీనియర్ నాయకుడు చెప్పారు. జైపాల్ అంటే దాదాపు బిజెపి యేతర పార్టీలన్నీ, వామపక్షాలతో సహా, మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అందుకే ఆయన ఢిల్లీలో ఇపుడవసరమవుతున్నారని ఆయన అంటున్నారు.
ఢిల్లీలో చక్రం తిప్పేందుకే రాజధానికి రమ్మని ఆయన్ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆహ్వానించారు. నేషనల్ స్పోక్స్ పర్సన్ ను చేశారు. తెలుగులో స్పోక్స్ పర్సన్ ని అధికార ప్రతినిధి అంటారు. ఈ రెండు మాటలకు పొంతనే లేదు. ఈ ట్రాన్స్ లేషన్ ఎపుడు చేశారో అది అతుక్కుపోయింది. ఇక్కడ అధికార ప్రతినిధులనే వాళ్లను చూసి, ‘ఇంతేనా, అయ్యే, జైపాల్ రెడ్డికి డిమోషన్’ అని గాంధీ భవన్ లో కొంతమంది చర్చించుకుంటున్నారు.
జైపాల్ రెడ్డి భాషకు చాలా ప్రాముఖ్యమిస్తారు. ఆయన పదాలు, వాక్యాలు చాలా పదునుగా ఉంటాయి. పొల్లుపోకుండా మాట్లాడి గుండెల్లో గునపాలు దించే శక్తి జైపాల్ కు ఉంది. రాజకీయ పండితుడే కాదు రాజకీయ తంత్రం కూడా తెలిసినా డు జైపాల్ రెడ్డి. యునైటెడ్ ఫ్రంటు రోజుల్లో కూడా ఆయన స్పోక్స్ పర్సన్. అపుడు ఆయన నడిపిన రాజకీయాలు అక్కడ ప్రత్యక్షంగా చూసిన వాళ్లకే తెలుస్తుంది.
కాంగ్రెస్ పార్టీ ఇపుడన్న పరిస్థీతుల్లో అల్లాటప్పా స్పోక్స్ పర్సన్ ను పెడితే, బిజెపి పట్టించుకోదు. జైపాల్ లాంటి వ్యక్తి అసవరం. జైపాల్ బిజెపి విషయంలో ఐడియాలజికల్ స్పోక్స్ పర్సన్. అంటే హైదరాబాద్ స్థాయిలో ఉన్న ‘అధికార ప్రతినిధులు’ వేరు. వాళ్ల మాండేట్ చాలా తక్కువ. వాళ్లు రూలింగ్ పార్టీని విమర్శించడం, పార్టీ మీద వచ్చే విమర్శలను తిప్పికొట్టడానికే పరిమితం. రాష్ట్ర రాజధానిలో అంతకంటే అవసరం ఉండదు. కాని ఢిల్లీ స్పోక్స్ పర్సన్ కి ఇంకా చాలా అర్హతలుండాలి. అందునా ఇపుడయితే స్పోక్స్ పర్సన్ కు చాలా ప్రత్యేక అర్హతలుండాలి. ఏమీ లేదు, ‘‘సింపుల్ గా చెప్పాలంటే, ఇపుడు కాంగ్రెస్ మీద సాగుతున్న దాడి ఐడియలాజికల్ దాడి. కాంగ్రెస్ కు ఐడెంటిటి తెచ్చిన నెహ్రూ లాంటి వాళ్లను చరిత్రనుంచి తీసేసేందుకు బిజెపి మేధావులు ప్రయత్నిస్తున్నారు. అంతో ఇంతో సెక్యులర్ సంప్రదాయం ఉన్న కాంగ్రెస్ ని నాశనం చేసే ప్రయత్నం సాగుతూ ఉంది. ఇలాంటపుడు ఈ ఐడియాలాజికల్ వార్ ఫేర్ లో అల్లాటప్పా స్పోక్స్ పర్సన్ లు పనికిరారు. బలమయిన ఐడియాలాజికల్ కమిట్ మెంట్ ఉన్నవాడే సాధ్యం. తెలుగునాట ఇపుడున్న ఎన్నికల పార్టీ మేధావులలో జైపాల్ ను మించిన నాయకుడు లేడు,’ లోగుట్టు తెలిసిన ఈ పెద్దాయన ‘తెలుగు రాజ్యం’ చెప్పాడు.
అందుకే నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్ అధినేత జైపాల్ అవసరం గుర్తించారు. ‘ఇది చారిత్రకావసరం’ అంటారాయన.
సోనియాగాంధీ ఎందుకో గాని ఈ అవసరాన్ని గుర్తించలేక పోయారు. నిజానికి 2014 తర్వాత ఇక మళ్లీ పోటీచేసేది లేదని ఆయన కొన్ని సందర్భాలలో అన్నట్లు ఆయన మిత్రులు చెబుతారు. అయితే, ఇపుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ ఆయన్ని రిటైర్ చేయించ లేదు. ఆయన క్రియా శీలంగా ఉంటారని, ఇదే రాష్ట్ర పతి భవన్ నుంచి కూడా పోషించే అవకాశాలున్నాయని తెలిసింది.