కెలుక్కున్నది చాల్లే అని సైలెంట్ అయ్యిపోయిన వర్మ

                                                   (సూర్యం)

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో సినిమాల మీద కన్నా వివాదాల మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. సినిమాని కళాత్మకంగా తీయటం కన్నా వివాదాస్పదంగా తీయటంలో మజా ఉందని కనుగుని ఆ థీరిని ప్రాక్టీస్ చేసారు. ఆ ఊపులో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే సినిమాని ప్రకటించారు. ఎన్టీఆర్‌ జీవితంలోని ప్రజలకు పెద్దగా తెలియని చీకటికోణాలను ఈ సినిమాలో ఆవిష్కరిస్తానంటూ వర్మ చెప్పారు. దాంతో ఈ
సినిమాపై ఆయన అభిమానుల్లో  అంచనాలు ఏర్పడ్డాయి. ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదిలేసారు. అయితే ఇప్పుడు సైలెంట్ అయ్యిపోయారు.

దివంగత ముఖ్యమంత్రి, నటుడు ఎన్టీ  రామారావు జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తీయనున్నట్టు వర్మ ప్రకటించిన నాటినుంచి.. ఈ ప్రాజెక్టు చుట్టూ అనేక వివాదాలు ముసురుకున్నాయి. అనేక మంది తెలుగు దేశం   నేతలు ఈ సినిమా విషయంలో వర్మపై విరుచుకుపడ్డారు. వారి విమర్శలకు, ఆరోపణలకు వర్మ ఫేస్‌బుక్‌ వేదికగా దీటుగానే సమాధానం ఇచ్చారు.

అంతేకాదు నిప్పుకు ఆధ్యం పోసేచందంగా ..ఎన్టీఆర్‌ తనకు షేక్‌హ్యాండ్‌ ఇస్తున్న ఫొటోను వర్మ తాజాగా ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఈ ఫొటోలో వెనుక ఎన్టీఆర్‌-శివపార్వతి దండలు మార్చుకుంటుండగా.. వారి వెనుక చంద్రబాబు నిల్చున్న ఫొటో ఉంది. ఈ ఫొటోకు వర్మ ఆసక్తికరమైన కామెంట్‌ పెట్టారు. ఎన్టీఆర్‌పై సినిమా తీస్తున్నందుకు ఆయన తనను అభినందిస్తున్నారంటూ పేర్కొన్నారు.

అంతా బాగానే ఉంది..ఇంత హంగామా చేసి వర్మ సైలెంట్ అయ్యిపోవటం అభిమానుల్లో చర్చనీయాంసంగా మారింది. ఆయనకు ఇదేం కొత్త విషయం కాదని..గతంలోనూ ఇలా ప్రాజెక్టులు ఎనౌన్స్ చేయటం , ప్రారంభించకుండానే ఆపేయటం మామూలేనని అంటున్నారు. ఆయనకూ ఇంట్రస్ట్ పోయినట్లుంది. ఈ సినిమా గురించి ఎక్కడా మాట వరసకు కూడా చెప్పటం లేదు.