పూరీ జగన్నాథ్ “చార్మింగ్” ఏది ?

పూరి జగన్నాథ్ నిస్సందేహంగా క్రియేటివ్ డైరెక్టర్. మాస్ పల్స్ బాగా తెలిసినవాడు . ఎప్పటికప్పుడు కొత్త కథలతో, సరికొత్త చిత్రాలను అందించడంలో పూరి జగన్నాథ్ సిద్ధహస్తుడు . రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చిన పూరి తనదైన ముద్ర సినిమా రంగం మీద వేశాడనే చెప్పాలి . ఎన్నో బ్లాక్  బస్టర్స్ అందించిన పూరి ఇప్పుడు ఫ్లాప్స్ లో పడి కొట్టుమిట్టాడుతున్నాడు . ఈరోజు పూరి జగన్నాథ్ 52వ జన్మ దినోత్సవం జరుపుకుంటున్నాడు .

పూరి జగన్నాథ్ కు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ప్రాణం. చదువు అయిపోయాక హైదరాబాద్ వచ్చి రామగోపాల్ వర్మ దగ్గర చేరి అనేక సినిమాలు పనిచేశాడు . 2000 సంవత్సరంలో “బద్రీ “అనే సినిమాతో దర్శకుడయ్యాడు . ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ , రేణుదేశాయ్ జంటగా నటించారు . పూరి తొలి సినిమానే ఘన  విజయం సాధించింది . తరువాత జగపతి బాబుతో బాచి సినిమా తీశాడు . తమ్ముడు సినిమాను “యువరాజ ” పేరుతో కన్నడంలో నిర్మించారు . పునీత్ రాజకుమార్ హీరోగా నటించాడు . ఈ సినిమాతో పూరి దర్శకుడుగా పరిచయం అయ్యాడు . తరువాత తెలుగులో “ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం , “ఇడియట్ “, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి “, “శివమణి ” సినిమాల్తో పూరి జగన్నాథ్
దర్శకుడుగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు .

“ఆంధ్రావాలా”, “దేశముదురు”,  “బిజినెస్ మాన్ “, “దేవుడు చేసిన మనుషులు ” చిత్రాల తరువాత పూరి జగన్నాథ్ నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకుల అభిమానం  అంతగా పొందలేదని చెప్పాలి . పూరి జగన్నాధ్ లో ప్రతిభ మసక  బారిందా, లేక అతి నమ్మకం ఫ్లాప్స్  వైపు నడిపించాయా ? అనే సందేహం వస్తుంది . “జ్యోతి లక్ష్మీ “, “లోఫర్ “,  “ఇజం ” “రోగ్ ” చిత్రాలు నిరాశనే మిగిల్చాయి .

బాలకృష్ణ 100 వ సినిమాగా వచ్చిన “పైసా వసూలు ” తన కుమారుడు ఆకాష్ హీరోగా తీసిన “మెహబూబా ” సినిమా పూరి ఇమేజీని బాగా దెబ్బతీశాయనే చెప్పాలి . తెలుగు , తమిళ,కన్నడ , హిందీ , బెంగాలీ  భాషా చిత్రాలకు పూరి దర్శకత్వం వహించాడు . దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే గత చిత్రాలు గురించి తప్ప ప్రస్తుత సినిమాలు గురించి  చెప్పుకోలేని స్థితి లో వున్నాడు . సినిమాకు కథలను ఎంపిక చేసుకోవడంలో తనదైన ప్రతిభ కనబరిచిన పూరి , సినిమాలకు టైటిల్స్ పెట్టడంలో కూడా ప్రత్యేకత చూపించిన పూరి రాను రాను నాసిరకం సినిమాలు అందిస్తున్నాడనే విమర్శ  బలంగా వినిపిస్తుంది . పూరి,చార్మీ తో కలసి సినిమాలు తీయడం మొదలు పెట్టాక అయన ప్రస్థానం అగమ్యంగా మారిందని అంటున్నారు .  పూరీ జగన్నాథ్ లోని  అతి నమ్మకమే ఆయన సినిమా జీవితాన్ని పరాజయం వైపు నడిపిస్తుందనే వాదన కూడా వుంది . ఏమైనా పడి లేచే కెరటంలా మళ్ళీ పూరీ జగన్నాథ్ లేస్తాడా ? లేక గత చిత్రాల స్మృతుల్లో గడుపుతాడా ?