లాక్ డౌన్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసస్ చారిటీ(సీసీసీ)ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి భారీ ఎత్తున విరాళాలు అందించారు. కష్టకాలంలో సినీ కార్మికుల్ని ఆదుకోవాలన్న సుదుద్దేశంతో మెగాస్టార్ ఈ విరాళాల సేకరణకు పిలుపునిచ్చి పనిచేసారు. మెగాస్టార్ ని గౌరవించి దాదాపు టాలీవుడ్ హీరోలంతా ముందుకొచ్చి తమకు తోచిన సహాయాన్ని అందించారు. నటులు, నిర్మాతలు, నటీమణులు, సాంకేతిక నిపుణులు ఇలా సినిమాకు సంబంధించిన 24 శాఖలు ముందుకొచ్చాయి. లాక్ డౌన్ సమయంలో నిత్యావసర సరుకులను కార్మికులందరికీ అందజేసారు.
మూడు , నాలుగు నెలలు పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిత్యావసర సరుకులు అందించి ఆ కుటుంబాల్ని ఆదుకున్నారు. ఇందులో కీలక పాత్ర పోషించింది మెగాస్టార్. ఆయనే స్వయంగా దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారు. నాణ్యమైన సరుకుల్ని అందజేసారు. స్వయంగా చిరంజీవి వీటిని పరీక్షించి ఒకే చెప్పిన తర్వాత ప్యాకింగ్ చేసి పంపిణీ చేయడం జరిగింది. దివంగత టాలీవుడ్ పెద్ద దర్శక రత్న దాసరి నారాయణరావు స్వర్గస్తులైన తర్వాత ఆ స్థానాన్ని చిరంజీవి తీసుకుని లాక్ డౌన్ ఆపత్కాలంలో సినీ కార్మికుల్ని ఆదుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి, ఏపీ సీఎంలు కేసీఆర్, జగన్ లు స్వయంగా చిరంజీవికి ఫోన్ చేసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే తెలంగాణ రాష్ర్టంలో ప్రతిపక్ష పార్టీ నేతలు చిరుపై ప్రశంసలు కురిపించారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుగానీ, ఆ పార్టీ మిగతా సీనియర్ నేతలు గానీ కనీసం సోషల్ మీడియా లో స్పందించను కూడా లేదు. అయితే చిత్తూరు జిల్లాకు చెందిన ఓపేద రైతుకు బాలీవుడ్ నటుడు సోనుసూద్ అతని కష్టాన్ని గుర్తించి ఓ ట్రాక్టర్ కొనిచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆ హీరోని అభినందించారు. సోను సూద్ స్పందన అందిరికీ స్పూర్తి దాయక మన్నారు. టాలీవుడ్ నటులలో కనిపించని స్ఫూర్తి చంద్రబాబు, లోకేష్ కి హిందీ నటుడిలో మాత్రమే కనిపించడం విశేషం. సహాయం చేసిన హీరోని స్ఫూర్తి దాతగా చెప్పడంలో తప్పులేదు. కానీ అప్పుడప్పుడైనా టాలీవుడ్ హీరోలని కూడా గుర్తించాలి బాబుగారు.