సీఎంతో సినీ పెద్దలకు ఏంటి సమస్య?
అవిభాజిత ఆంధ్ర ప్రదేశ్ లో వినోద పరిశ్రమ సీనేంటి? ఏపీ, తెలంగాణ విడిపోయాక జరిగిన ఆసక్తికర చర్చ ఇది. టాలీవుడ్ ఏపీకి తరలి వెళ్లిపోతుందన్న చర్చా అప్పట్లో సాగింది. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఏపీలో తెలుగు సినీపరిశ్రమ అభివృద్ధిపై సినీపెద్దల్లో ఆసక్తికర చర్చ సాగింది. ఏపీలో ఫిలింస్టూడియోల నిర్మాణానికి అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని దరఖాస్తులు అందాయి. ప్రఖ్యాత ఏవీఎం స్టూడియోస్ సహా నందమూరి బాలకృష్ణ కూడా బీచ్ సొగసుల విశాఖ నగరంలో ఫిలింస్టూడియోల నిర్మాణానికి ఆసక్తిగా ఉన్నారని వీళ్లకు భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని ప్రచారమైంది. ఆ మేరకు ఏపీఎఫ్‌డీసీ అప్పట్లో ఓ ప్రెస్ రిలీజ్ ని మీడియాకి అధికారికంగా పంపించింది.
అయితే ఈ ప్రయత్నం ఆదిలోనే వీగిపోయిందని ఆ తర్వాత నెమ్మదిగా అందరికీ అర్థమైంది. ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదు. దానికి తోడు సినీపెద్దల్లోనూ అనాసక్తి వల్ల కూడా ఇలా జరిగిందని అంతా భావించారు. అయితే ప్రభుత్వం తలుచుకుంటే సాధ్యం కానిది ఉంటుందా? నిజాయితీగా చేయాలన్న ఆసక్తి అస్సలు కనిపించలేదని విమర్శలొచ్చాయి. 2019 ఎన్నికల్లో తెదేపా, చంద్రబాబు ఓటమి తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే సీఎం మారాక అయినా ఏపీలో కొత్త టాలీవుడ్ నిర్మాణం జరుగుతుందా? అంటే అందుకు కూడా హోప్ కనిపించడం లేదన్న మాటా వినిపిస్తోంది. ఓవైపు సినీపెద్దలంతా చంద్రబాబుకు అనుకూలంగా ఉండడం జగన్మోహన్ రెడ్డికి రుచించడం లేదు. దీంతో సినిమా వాళ్లంటేనే ఆయన విరుచుకుపడుతున్నారట. ఇప్పటికే పలుమార్లు తెలుగు సినీపరిశ్రమ పెద్దలపై 30 ఇయర్స్ పృథ్వీ జగన్ ప్రభుత్వం తరపున తీవ్రమైన కామెంట్లు చేశారు. చంద్రబాబు నచ్చినట్టు జగన్ నచ్చడం లేదా? అని ప్రశ్నించారు. అయితే ఆ తర్వాత పోసాని కృష్ణమురళి ఓ సందర్భంలో ఇదే విషయాన్ని ప్రస్థావిస్తూ.. పరిశ్రమ అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు చంద్రబాబును కలిసేందుకు వెళ్లారని అయితే అప్పుడు కుదరలేదని తెలిపారు. పరిశ్రమ తరపున జగన్ ని కలిసేందుకు టాలీవుడ్ పెద్దలు సుముఖంగానే ఉన్నారు. కానీ ఇప్పటివరకూ జగన్ అపాయింట్ మెంట్ మాత్రం అందలేదన్న మాటా వినిపించింది. కారణం ఏదైనా ఇరు ప్రభుత్వాల్లోనూ కొత్త టాలీవుడ్ గురించిన సరైన చర్యలు లేకపోవడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. మద్రాసు నుంచి సినీపరిశ్రమ హైదరాబాద్ కి తరలి వచ్చింది. ఇక్కడ ఒక పరిశ్రమ అభివృద్ధి చెంది ఉంది. దీనికి ధీటుగా మరో కొత్త పరిశ్రమ అభివృద్ధి చెందాల్సిన అవసరం అంతే ఉంది. అలా చేస్తే తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్లా వినోద పరిశ్రమ రెట్టింపవుతుంది. ఉపాధి పదింతలు అవుతుందని ఆశించేవాళ్లు ఉన్నారు. ఈ పరిశ్రమ ఉండగానే మరో పరిశ్రమకు రూపకల్పన జరగాల్సి ఉందన్న ముచ్చటా నిరంతరం సినీపరిశ్రమలో సాగుతోంది. అయితే అందుకు తగ్గ ప్రయత్నాలే కనిపించడం లేదు. అయితే ఏపీలో ప్రభుత్వ సాయంతో డిస్నీ ల్యాండ్ తరహాలో గుంటూరు పరిసరాల్లో ఒక స్టూడియోని అంతర్జాతీయ సంస్థ సాయంతో నిర్మిస్తామని టాలీవుడ్ రచయిత కోన వెంకట్ ప్రకటించడం విస్మయ పరిచింది. ఆయనకు అంత సీన్ లేకపోయినా కనీసం ఆలోచన అయినా చేశారు! అన్న ఆనందం యువతరంలో రెట్టించిన ఉత్సాహం నింపింది. ఆ మేరకు ఉత్సాహం ప్రభుత్వ పెద్దల్లో లేకపోవడం వెరీ బ్యాడ్ అన్న టాక్ కూడా ఫిలింవర్గాల్లో వినిపించింది.
ప్రపంచవ్యాప్తంగా వినోద పరిశ్రమ అంతకంతకు పెరుగుతున్నా మన పరిశ్రమ కొన్ని విషయాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంకా ఈ రంగం పెరిగేందుకు స్కోప్ ఉన్నా ఆ ప్రయత్నాలు అయితే చిత్తశుద్ధితో సాగడం లేదు. దేనికైనా ప్రభుత్వాలు చొరవ చూపించాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ సరైన ఆసక్తి కనిపించలేదని అర్థమవుతోంది. తెలంగాణలోనూ పూణే తరహా ఫిలింఇనిస్టిట్యూట్ ప్రారంభిస్తామని.. గచ్చిబౌళిలో యానిమేషన్ హబ్ ప్రారంభిస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్- మంత్రి కేటీఆర్ ఇంతవరకూ దానిని పట్టించుకున్నట్టే కనిపించలేదు. దీంతో ఇక్కడా అభివృద్ధి అంతంత మాత్రమేనన్న విమర్శ ఉంది. మరి మునుముందు అయినా ప్రభుత్వాల వైఖరిలో మార్పు వస్తుందా? సినీపరిశ్రమల అభివృద్ధిపైనా చొరవ చూపిస్తారా? అన్నది చూడాలి.