విశాల్‌కు ఇద్దరు సెట్ అయ్యారు. నటుడు విశాల్ ఆయోగ్య చిత్రం తరువాత నటిస్తున్న చిత్రం ‘యాక్షన్’. టైటిల్ చూస్తేనే తెలిసి పోతుంది ఇది పుల్ యాక్షన్ చిత్రమని. ఎంటర్‌టైన్ చిత్రాలు చేయడంలో సిద్ధహస్తుడైన సుందర్.సీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో విశాల్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈయన ఇంతకు ముందు నటించిన హిట్ చిత్రం ఇరుంబుతిరై ద్వారా పీఎస్.మిత్రన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. నటి సమంత హీరోయిన్‌గా నటించింది. కాగా ఇప్పుడీ చిత్రం సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. విశాల్‌కు జంటగా నటి రెజీనా, శ్రద్ధాశ్రీనాథ్ నటించనున్నారన్నది తాజా సమాచారం.
చెన్నై చిన్నది రెజీనా ఇంతకు ముందు పలు తమిళ చిత్రాల్లో నటించి సక్సెస్‌లు అందుకున్నా, స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను సంపాదించలేకపోయ్యింది. కండనాళ్ ముదల్ చిత్రంతో పరిచయ్యమై గుర్తింపు పొందిన ఈ బ్యూటీ ఆ తర్వాత అళగియ అసుర, పంచామృతం చిత్రాల్లో నటించినా అవి తన కేరీర్‌కు ఉపయోగపడలేదు. అలాంటిది ఇన్నాళ్లకు నటుడు విశాల్‌తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ చిత్రం అయినా రెజీనాకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెడుతుందేమో చూద్దాం. ఇక శ్రద్దాశ్రీనాథ్ విషయానికి వస్తే వేదా చిత్రంతోనే తమిళ సినీ ప్రరిశ్రమ తన వైపు తిరిగి చూసేలా చేసుకుంది. ఇటీవల అజిత్‌తో నటించిన నేర్కొండ పార్వై చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఈ భామలు ఇద్దరూ విశాల్‌తో నటించడానికి రెడీ అవుతున్నారన్నమాట. కాగా దర్శకుడు పీఎస్.మిత్రన్ ప్రస్తుతం శివకార్తీకేయన్‌తో హీరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసి విశాల్‌తో ఇరుంబుతిరై 2 చేయనున్నట్లు సమాచారం.