మామా- అల్లుడు పందెం పొట్టేళ్లు
మామతో అల్లుడు ఎటకారంపండగ అంటేనే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పందెం ఉంటుంది. మునుముందు బోలెడన్ని పండగలు ఉన్నా దసరా పండగకు ఉన్న ప్రత్యేకత వేరు. సరిగ్గా ఇదే పాయింట్ ని వెంకీ మామ క్యాష్ చేసుకోబోతున్నాడు. ఆ మేరకు ఇప్పటికే రిలీజ్ తేదీని లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఒక్కో అప్ డేట్ అంతకంతకు ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ సినిమా కథాంశం ప్రకారం.. తెరపై మామా- అల్లుడు పందెం పొట్టేళ్లుగా కనిపిస్తారట. అక్కినేని అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులకు దసరా సంబరం తెస్తారని చెబుతున్నారు. మామతో అల్లుడి ఎటకారం ఓ లెవల్లో ఉంటుందట. నిజజీవితంలో మామా అల్లుళ్లయిన విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య తొలిసారి కలిసి నటిస్తున్నారు. `ప్రేమమ్`లో అల్లుడు నాగచైతన్య కోసం మామ పాత్రలోనే నటించి అదరగొట్టారు వెంకటేష్. సినిమాలో ఐదు నిమిషాలు కలిసి నటిస్తేనే ఇలా వుంటే సినిమా మొత్తం ఇద్దరి కలయికలో సీన్లు వుంటే ఏ రేంజ్‌లో వుంటుందో వెంకీ మామలో చూడొచ్చని అంటున్నారు. నాటి మ్యాజిక్‌నే `వెంకీ మామ` రిపీట్ చేయబోతోంది. వెంకీ మార్కు ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్ మెంట్ చైతూ మార్క్ యూత్ అప్పియరెన్స్ ఇంపార్ట్ చూపిస్తాయట. దర్శకుడు బాబి ఈ చిత్రాన్ని సకల హంగులతో సిద్ధం చేస్తున్నాడు. చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతోంది. ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు చిత్రీకరణ మొత్తం పూర్తి చేయబోతున్నారు. దసరాకు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్నది నిర్మాత సురేష్‌బాబు ప్లాన్.
ఇక మామా అల్లుళ్ల హంగామాకు సంబంధించిన టీజర్‌ని ఆగస్టు 15న విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. వెంకీ-చైతూ తొలి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో డి. సురేష్‌బాబు ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ టీజర్‌ని చాలా స్పెషల్‌గా రెడీ చేయిస్తున్నారట. దీంతో ఈ సినిమా దర్శకుడు బాబీకి ఇది బిగ్ ఛాలెంజ్‌గా మారిందట. పవర్, సర్దార్ గబ్బర్‌సింగ్, జై లవకుశ చిత్రాల తరువాత బాబీ చేస్తున్న మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ఇది. `పవర్` హిట్ చిత్రంగా నిలిస్తే.. చివరిగా రిలీజైన `జై లవకుశ` హిట్ టాక్ తెచ్చుకున్నా లాభాలు తేలేకపోయింది. దాంతో `వెంకీ మామ` విషయంలో బాబిపై భారీ ఒత్తిడి నెలకొంది. మామా అల్లుళ్లతో బాబి ఈసారి మ్యాజిక్ చేస్తాడనే సురేష్ కాంపౌండ్ భావిస్తోందట.