కుల రాజకీయాల్ని ఆ లెవల్లో కెలుకుతున్న ఆర్జీవీ!
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు కొత్త యుద్ధం ఇది కొత్త యుద్ధం
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు కొత్త యుద్ధం ఇది కొత్త యుద్ధం ..
….ఇదీ రచ్చ.. వర్మ మార్క్ రచ్చ మొదలైంది. `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` పేరుతో ఏపీ రాజకీయాల్ని ప్రతిబింబించే సినిమాని ఆర్జీవీ తీస్తున్నారా? అంటే అందుకు తాజాగా రివీల్ చేసిన లిరికల్ వీడియో ప్రత్యక్ష సాక్ష్యం. ఏపీలో కులరాజకీయాలు ఏ స్థాయిలో సాగుతున్నాయో ఆర్జీవీ చూపించబోతున్నారా? లేక కులాల మధ్య ఆధిపత్యాన్ని చూపించబోతున్నారా? లేదూ అధికారం కోసం కులాన్ని ఎవరు ఎలా వాడుకుంటున్నారు? అన్నది హైలైట్ చేయబోతున్నారా? దశాబ్ధాల పాటు తెలుగు ప్రజల్ని పాలిస్తున్న ఆ రెండు అగ్ర కులాల దాష్ఠీకాలన్నిటినీ తెరపై ఆవిష్కరించబోతున్నాడా? ఇప్పటికైతే సస్పెన్స్. ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఇది కమ్మ- రెడ్డి కులాల మధ్య వార్ కి సంబంధించిన పొలిటికల్ థ్రిల్లర్ అని ఆర్జీవీ స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పారు. టైటిల్ లోనే మ్యాటరంతా లీక్ చేసిన వర్మ తాజాగా రిలీజ్ చేసిన లిరికల్ వీడియోతో మరోసారి రచ్చకు తెరతీశాడు. నిన్ననే తొలి లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాం అంటూ హింట్ ఇచ్చిన ఆర్జీవీ.. అన్నంత పనీ చేశాడు.
`వైయస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను`.. అంటూ సీఎంగా ప్రమాణ స్వీకారం విజువల్ తో మొదలైంది లిరికల్ రచ్చ. ఆ తర్వాత అసెంబ్లీ కొలువు దీరినప్పటి నుంచి ఇప్పటివరకూ ఏపీ రాజకీయాల్లో సాగుతున్న రచ్చ మొత్తాన్ని వీడియోలు వెతికి మరీ ఈ పాటలో గుది గుచ్చారు. పార్టీకో పత్రిక. ఆ పత్రికల్లో ఎవరికి నచ్చిన వార్తలు వాళ్లు రాసుకుంటారని.. చానెళ్లలో యాంకర్లు.. రిపోర్టింగ్ వ్యవస్థను కూడా కెలికారు లిరిక్ లో.
వీడియో: కమ్మ రాజ్యంలో కడప రెడ్లు
నవ్వుతు వేసే ఎత్తుగడ.. చప్పుడు లేనిది ఈ రగడ.. ప్రత్యర్థులకు గుండె దడ.. బయటకు దారి లేదిక్కడ… అంటూ పవర్ ఫుల్ వర్డ్స్ ని ఉపయోగించి పాటలో బోలెడంత రచ్చ చేశారు. చేతిలో కత్తి కత్తి పక్క దోమ! అంటూ అసెంబ్లీలో చంద్రబాబును అవమానించే సన్నివేశం… వయసు చూసి అయినా గౌరవించరా? అంటూ చంద్రబాబు ఆక్రంధన.. ఇవన్నీ విజువల్స్ లో హైలైట్ చేశారు. కుక్క తోక వంకర అంటూ జగన్ దాష్ఠీకం .. ఒకటేమిటి…? పాట ఆద్యంతం రగిలించారు.
యుద్ధం చేసే పద్ధతి మొత్తం మారిందిపుడు.. పదవి వచ్చే వరకూ రాజు.. ఆ తర్వాత ప్రజాస్వామ్యం ఎటువైపు పోతుందో? అంటూ వాస్తవాన్ని కళ్లకు గట్టేలా లిరిక్ ని మలిచారు. ఇక ఈ వీడియో ఆద్యంతం చంద్రబాబు అసహనాన్ని రకరకాల ఎక్స్ ప్రెషన్స్ రూపంలో చూపించడం వెనక వర్మ తనపై ఉన్న కక్షను బయటపెట్టారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు రిలీజ్ ముందు వివాదాల రచ్చ మాట అటుంచితే అసలు ప్రారంభం కాక ముందే కులాల్ని రెచ్చగొట్టడం చూస్తుంటే ఇది ఎటు వెళుతుందో.. అన్న ఆందోళన సగటు జీవుల్లో మొదలైంది. ఇంతకీ ఈ సినిమాని మొదలెట్టేదెప్పుడు? ఏదో కొన్ని విజువల్స్ సేకరించి ఇలా రచ్చ చేస్తే సరిపోతుందా ఆర్జీవీ?