అహం మీద కొడితే చంపేస్తాడు
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. ఆర్జీవీ లేటెస్ట్ చిత్రమిది. ఈ సినిమా విషయంలో ఎప్పటిలానే ఆర్జీవీ తనదైన శైలిలో దూకుడు చూపిస్తూ ప్రచారం ఊదరగొట్టేస్తున్నారు. ప్రారంభమే టైటిల్ పాటను పాడి నానా రచ్చ చేసిన ఆర్జీవీ “బాబు చంపేస్తాడు.. అహం మీద కొడితే చంపేస్తాడు..“ అంటూ మరో లిరికల్ పాటను రిలీజ్ చేశారు తాజాగా..
ఈ పాటను వచన శైలిలో ఆరంభించిన ఆర్జీవీ.. చాలా గమ్మత్తయిన లోతయిన విషయాల్ని తెలియజెప్పారు. ఏపీలో ప్రస్తుత రాజకీయాల్ని కళ్లకు గట్టారు. మన కళ్ల ముందే జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని చూస్తుంటే నిజమా కలా అని సందేహపడుతూ ముక్కు మీద వేలేసుకోవడం తప్పట్లేదు. రాజకీయ నాయకులు అత్యంత ప్రాజదరణతో గెలిచిన ఇప్పటి ముఖ్యమంత్రిని టెర్రరిస్టుతో పోలుస్తున్న అప్పటి ముఖ్యమంత్రి.. ఏమిటీ వైపరీత్యం? ఏమిటీ రాష్ట్రం? ఎక్కడికి పోతోంది మన దేశం? నిజ నిజాలు అబద్ధబద్ధాలు ఏమైనప్పటికి ఈ విపత్కర పరిస్థితి కారణం కమ్మ రాజ్యంలోకి కడప రెడ్లు రావడం.. అంటూ గీతాన్ని ఆలపించారు. ఒక మనిషి అహం దెబ్బ తింటే ఎంత ఎక్స్ ట్రీమ్ కి వెళతాడో చెప్పేదే ఈ పాట అంటూ హోరెత్తించాడు. ఆర్జీవీ స్వయంగా పాడటంతో ఈ పాటకు హైప్ ఆ రేంజులోనే ఉందనడంలో సందేహం లేదు.
చెంప మీద కొడితే తట్టుకోగలడు.. కాళ్ల మధ్య తంతే నిలదొక్కుకోగలడు.. కానీ అహం మీద కొడితే చంపేస్తాడు.. చంపేస్తాడు.. చంపేస్తాడు.. చంపేస్తాడు.. చంపేస్తాడూ…. బాబు చంపేస్తాడు.. అంటూ ఆర్జీవీ ఈ పాట కోసం ఉపయోగించిన పదాలు ఒక రకంగా బాబు స్వభావాన్ని ఆవిష్కరించేలా ఉన్నాయి.. అయితే దీనిపై చంద్రబాబు వర్గాలు ఎలా స్పందిస్తాయి? అన్నది చూడాల్సి ఉంది. పాట ఆద్యంతం చంద్రబాబు, నారా లోకేష్ బాబులను హైలైట్ చేశాడు. ఆ ఇద్దరికీ రాజకీయ ప్రత్యర్థులైన వైకాపా నాయకుల్ని చూపిస్తూ వాళ్లను చంపేస్తాడు! అంటూ ఇటీవల పొలిటికల్ వార్ ని కళ్లకు కట్టేలా ఈ లిరికల్ వీడియోలో చూపించారు. ఆరంభమే వివాదాలతో కాక రేపుతున్న ఆర్జీవీ మునుముందు ఇంకా ఇంకా ఏం టచ్ చేస్తారు? అన్న క్యూరియాసిటీ పెరుగుతోంది. ఈ సినిమా ఇంకా ప్రీప్రొడక్షన్ దశ నుంచి ఏ స్థాయికి వెళ్లింది అన్నది తనే ప్రెస్ మీట్ పెట్టి చెబుతాడేమో చూడాలి.