వరుణ్ తేజ్.. అవార్డు నటుడి లెవల్లో!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అవార్డ్ రేంజ్ పెర్ఫామెన్స్ చేశాడా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. `వాల్మీకి` చిత్రంలో నటనకు అవార్డు వస్తుందని గుసగుస ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో వేడెక్కిస్తోంది. వాల్మీకి టీజర్ ని రిలీజ్ చేసిన క్రమంలో అవార్డు రేంజులో పెర్ఫామ్ చేశాడని మీడియాలో చర్చ సాగింది.
వరుణ్ తేజ్ మొండి గద్దలకొండ గణేష్ పాత్రలో బాగా కుదిరాడు. ఆ గుబురు గడ్డం.. పనలా విడిపోయిన రింగుల జుత్తు.. కోరమీసం వగైరా అతడికి పెర్ఫెక్ట్ గానే సూటయ్యాయి. ఆ గెటప్ లో అతడు వికటాట్టహసం చేస్తుంటే దుర్యోధనదుశ్శాసనుడిలాగే కనిపించాడు. అంతా బాగానే ఉంది కానీ.. వరుణ్ తేజ్ ఇంత కష్టపడి నటిస్తున్నాడు కాబట్టి జాతీయ అవార్డ్ ఏదైనా వస్తుందా? అంటూ చర్చ మొదలైంది. ఇదే విషయంపై దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. కాస్త అటూ ఇటూగా ఓ మాట అన్నాడు. తమిళ చిత్రం జిగర్తాండలో బాబీ సింహా ఈ పాత్ర చేశాడు. అతడికి జాతీయ అవార్డు వచ్చిందని హరీష్ గుర్తు చేశాడు. “వరుణ్ తన వయసుకు మించిన పాత్రలో నటించాడు. ఆయన గట్స్‌కి నిజంగా హ్యాట్సాఫ్“ అని అన్నాడు.
అంతా బాగానే ఉంది కానీ.. ఓ డబ్బింగ్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తే జాతీయ అవార్డ్ వచ్చే సీనుంటుందా? అన్నది పాయింట్. వరుణ్ తేజ్ అద్భుతంగా నటించాడు. రామ్ చరణ్ `రంగస్థలం` చిత్రంలో చిట్టిబాబులా ఎంత ఇంపాక్ట్ వేశాడో అంతకుమించి ప్రభావం చూపించేట్టే ఉన్నాడు. ట్రైలర్ తో అంత మెప్పు పొందాడు. సినిమా ఆద్యంతం గణేష్ పాత్రలో అలాంటి మెరుపులు ఉంటాయని అర్థమవుతోంది. ఇందులోనే కాలేజ్ బుల్లోడిగా డబుల్ రోల్ చేస్తున్నాడు కాబట్టి యూత్ కి బాగానే నచ్చేసాడని చెప్పొచ్చు. రంగస్థలంలో రామ్ చరణ్ నటనకు జాతీయ అవార్డ్ ఆశిస్తే నిరాశే ఎదురైంది. ఇప్పుడు వరుణ్ కి వస్తుందా? అయినా అవార్డులు రివార్డులతో పనేం ఉంది? జనాదరణను మించిన అవార్డు ఉంటుందా?