మన తెలుగు సినిమా ఖ్యాతి, దేశ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేశాడు రాజమౌళి. బాహుబలి సినిమాలతో రాజమౌళి చేసిన మాయాజాలం ఎప్పటికీ ఎవ్వరూ కూడా మరిచిపోరు. బాహుబలి సినిమాతో టాలీవుడ్ పేరు ప్రపంచపటంలో మార్మోగిపోయింది. అంతర్జాతీయ వేదికలపై తెలుగోడు సగర్వంగా తలెత్తుకునేలా చేశాడు జక్కన్న. ఆయన అంతలా ధైర్యం చేసి అన్ని వందల కోట్ల సినిమాను తెరకెక్కించి.. అన్ని వేల కోట్ల కొల్లగొట్టాడు కాబట్టే ఇప్పుడు ఈ పాన్ ఇండియా పదం వాడుకలోకి వచ్చింది.
పాన్ ఇండియా అనే పదం బహుషా బాహుబలి తరువాతే ఎక్కువగా వాడుతున్నారు. అది కూడా రాజమౌళి ఇచ్చిన చలువే. అలా పెద్ద స్థాయిలో సినిమా తీస్తే.. జనాలు ఆదరిస్తారని.. అందరికీ నమ్మకం ఇచ్చాడు. కథ బాగుంటే ఎంతైనా ఖర్చుపెట్టవచ్చనే ధైర్యాన్ని ఇచ్చాడు. అందుకే ఇప్పుడు వరుసబెట్టి పాన్ ఇండియన్, భారీ బడ్జెట్ చిత్రాలు వస్తున్నాయి. వీటన్నంటికి పరోక్షంగా కారణం రాజమౌళినే. సైరా సమయంలో చిరంజీవి బహిరంగంగానే ఈ విషయాన్ని చెప్పాడు.
ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా అదే విషయాన్ని చెప్పాడు. చెక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. రాజమౌళి గురించి మాట్లాడే అవకాశం ఇప్పటి వరకు నాకు రాలేదు. ఆయనతో తొలిసారి వేదికను పంచుకోవడం నాకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. స్కూల్ డేస్ నుంచి మీ సినిమాలు చూశాను సార్. మీకు నేను పెద్ద అభిమానిని. కలలు పెద్దగా కనాలని మీరు అందరికీ సూచించారు. మీ వల్లే ఇండస్ట్రీలో అందరూ పెద్దగా కలలు కంటున్నారు, గొప్పగా ఆలోచిస్తున్నాను. ఆ క్రెడిట్ అంతా మీకే సార్ అని జక్కన్నపై ప్రశంసల వర్షం కురిపించాడు.