తెలుగు టీవి సీరియల్ నటిపై మూకుమ్మడి దాడి

గొలుసు విషయంలో తలెత్తిన ఓ వివాదం టీవీ సీరియల్ నటిపై మూకుమ్మడి దాడికి కారణమైంది. తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారనే నెపంతో మాధురిపై కోపం పెంచుకున్న హెయిర్‌ డ్రెసర్‌ జ్యోతిక తన అనుచరులతో కలిసి ఆమెపై దాడికి పాల్పడ్డారు.

పోలీసుల కథనం ప్రకారం.. ‘జ్యోతి’ పేరుతో నిర్మితమవుతున్న ఓ సీరియల్ కు సంబంధించి షూటింగ్ బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 13లో చేస్తున్నారు. కాగా గచ్చిబౌలిలో నివసించే టీవి నటి రాగమాధురి(37) ఇందులో నటిస్తున్నారు. ఈ నెల 16న షూటింగ్ అనంతరం రాగమాధురి ఇంటికి వెళ్లి చూసుకోగా తన గొలుసు మాయమైనట్లు గుర్తించారు.

షూటింగ్‌కు వచ్చిన వారందరినీ ఫోన్‌లో ఆరా తీశారు. ఎవరూ తీయలేదని చెప్పడంతో ఆమె బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో హెయిర్ డ్రసర్ జ్యోతిక, మరో ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు విచారణ నిమిత్తం జ్యోతికను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ఆ సమయంలో షూటింగ్‌కు చెందిన కొందరు కారులో గొలుసు దొరికిందంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చి అది పోలీసులకిచ్చి జ్యోతికను తీసుకెళ్లారు.

ఈ క్రమంలో జ్యోతిక మరో ఏడెనిమిది మంది సభ్యులతో కలిసి సోమవారం షూటింగ్‌ ప్రాంతానికి వెళ్లి రాగమాధురిని తిట్టిపోసింది. రాగమాధురిని తీవ్రంగా కొట్టారు. సెట్‌లో వారు నిలువరించిన వినకుండా ఆమె చీరను కూడా లాగేశారు. దీంతో రాగమాధురి మరోసారి బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. నాగమాధురి ఫిర్యాదు మేరకు జ్యోతికతోపాటు ఆమె అనుచరలపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు జ్యోతిక, మరో ఏడుగురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.