డిజిటల్లో అతి పెట్రేగుతోందా?
వెబ్ సిరీస్ లు.. వెబ్ (ఓటీటీ) సినిమాలు.. ప్రస్తుతం హాట్ టాపిక్. డిజిటల్ వేదిక ఇప్పుడు వేడెక్కిస్తోంది. నిరంతరం వెబ్ సిరీస్ లు.. వెబ్ సినిమాలు వేడెక్కించే కంటెంట్ తో యువతరంలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్- డిజిటల్ మాధ్యమంలో వీక్షణకు సెన్సార్ షిప్ అన్నది లేకపోవడంతో అది కాస్తా హద్దు మీరి గాడి తప్పుతోందన్న తీవ్ర విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది.
రొమాన్స్ పేరుతో మితిమీరిన శృంగారం.. క్రైమ్ థ్రిల్లర్ల పేరుతో జుగుప్స కలిగించే మర్డర్ స్టోరీల్ని .. ట్విస్టులు టర్నులు హారర్ పేరుతో రకరకాల దెయ్యం కథల్ని వెబ్ సిరీస్ లలో చూపించడం అధికమైంది. మిస్టరీ .. రొమాన్స్.. థ్రిల్లర్లు అంతకంతకు కాకలు పుట్టించేస్తున్నాయి. ఇక సంఘంలో పెట్రేగుతున్న శృంగార కార్యకలాపాలపైనా.. మగువల విశృంఖలత్వం పైనా.. సెక్స్ బెడ్ రూమ్ వ్యాపకాలు వంటి వేడి పెంచే అంశాలపైనా.. సినిమాలు పెచ్చు మీరుతున్నాయన్న వాదన వినిపిస్తోంది.
ఇటీవలి కాలంలో ఈ కోవకే చెందిన పలు వెబ్ సినిమాలు యూత్ టీనేజర్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. వీటిలో కృష్ణ అండ్ హిజ్ లీలా కథాంశంపైనా.. అలాగే లేటెస్టుగా రిలీజైన `రాస్ భరి` కథాంశంపైనా వాడి వేడిగా చర్చ సాగుతోంది. కృష్ణ.. రాధ అంటూ హిందూ దేవుళ్ల పేర్లను అపవిత్రం చేస్తూ శృంగార పురుషుడి లీలల్ని వెబ్ సినిమాలో చూపించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
తాజాగా స్వరా భాస్కర్ లాంటి ట్యాలెంటెడ్ నటి ప్రధాన పాత్రలో నటించిన `రాస్ భరి` వెబ్ సిరీస్ ఇదే తీరుగా విమర్శల పాలవుతోంది. ఇందులో పెచ్చు మీరిన శృంగారాన్ని ప్రమోట్ చేశారని విమర్శ ఎదురైంది. ఒక మగువ తన చుట్టూ ఉన్న కుర్రాళ్లను శృంగారం అనే ముగ్గులోకి దించేందుకు ఎంతకైనా తెగిస్తుంది! అలాంటి ఓ ప్రమాదకర ఆడదాని కథాంశాన్ని ఎంచుకోవడం ద్వారానే యూత్ ని ముఖ్యంగా టీనేజర్స్ ని రెచ్చగొట్టే ఎత్తుగడను ఎంచుకున్నారని ఈ వెబ్ సిరీస్ ని వీక్షించిన వారు విమర్శిస్తున్నారు.
సినిమా.. టీవీ మాధ్యమాలు చెడును ప్రోత్సహించడం సరికాదు. దాని ప్రభావాన్ని తగ్గించేందుకు సెన్సార్ షిప్ పకడ్భందీగా పని చేయాలి అన్న వాదనా వినిపిస్తోంది. ఇకపై డిజిటల్ మాధ్యమంలో మరీ బూతును విశృంఖలత్వాన్ని పెరగకుండా అడ్డుకట్ట వేయాలన్న సూచనలు నెటిజనుల్లో పెరిగాయి. అయితే వీటన్నిటినీ పట్టించుకునే పరిస్థితిలో ఆధునిక భావజాలం ఉన్న క్రియేటర్స్ .. దర్శకనిర్మాతల్లో ఎవరైనా ఉన్నారా? అంటే కష్టమే.
ఎంతో సీనియారిటీ ఉన్న రామ్ గోపాల్ వర్మ లాంటి వెటరన్ ఐస్ క్రీమ్.. జీఎస్టీ.. నేక్డ్.. కామం అంటూ బూతు సినిమాలు తీస్తుండడంతో అది తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి అతిపై నిషేధం విధించాలన్న అభిప్రాయం సాంప్రదాయ వాదుల్లో బలంగా వినిపిస్తోంది.