ఫ్యామిలీ మల్టీస్టారర్ తీస్తే ఏ కాంబినేషన్ క్రేజీ?
టాలీవుడ్ లో ఫ్యామిలీ మల్టీస్టారర్లకు కొదవేమీ లేదు. క్లాసిక్ డేస్ అగ్ర హీరోలంతా కలిసి బోలెడన్ని మల్టీస్టారర్లలో నటించారు. ఇటీవల అక్కినేని కుటుంబ హీరోలు అంతా కలిసి నటించిన `మనం` ఎంతటి సంచలనమో తెలిసిందే. ఆ తర్వాత మంచు ఫ్యామిలీ మల్టీస్టారర్లు వరుసగా వచ్చినా కానీ ఏవీ మెప్పించలేకపోయాయి. ఆ తర్వాత పలు మల్టీస్టారర్లకు సన్నాహాలు అయితే సాగాయి. కానీ అవేవీ ఇప్పుడు సందడి చేయడం లేదు ఎందుకనో! ఇంతకీ ఫ్యామిలీ హీరోల మల్టీస్టారర్లు వస్తాయా రావా? అంటే చెప్పలేని పరిస్థితి.
టాలీవుడ్ ని ఏల్తున్న మెగా ఫ్యామిలీ మల్టీస్టారర్ కి ఇప్పట్లో ఆస్కారమే కనిపించడం లేదు. ఆ ఫ్యామిలీ హీరోలంతా ఒకే సినిమాలో కనిపించాలంటే అందుకు తగ్గ కథను, కంటెంట్ ని ఇచ్చే దమ్ము ఇప్పుడున్న దర్శకుల్లో కనిపించడం లేదని మెగాభిమానులు నిరాశలోనే ఉన్నారు. చిరంజీవి – పవన్ కల్యాణ్ సహా మొత్తం డజను మంది స్టార్లు ఆ కుటుంబంలో ఉన్నారు. వీళ్లందరినీ కలుపుతూ తీసే స్క్రిప్టు అంత ఈజీ కాదేమో!
`చిరు-చరణ్` కలిసి కొరటాల `ఆచార్య`లో నటించనున్నారని ప్రచారమైనా అయ్యేవరకూ కష్టమే. ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ ఆలస్యమవ్వడంతో చరణ్ కాల్షీట్లు కేటాయించలేని పరిస్థితి ఉందిప్పుడు. చిరంజీవి- పవన్ కల్యాణ్ కాంబినేషన్ మూవీ కోసం అశ్వనిదత్- టీఎస్సార్ సన్నాహాలు చేసినా కుదరలేదు. త్రివిక్రమ్ నేను సిద్ధమేనని చెప్పినా.. ఇంతవరకూ కథను కూడా రెడీ చేయలేదు.
మెగా హీరోల్లోనే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంతకుముందు పైడిపల్లి దర్శకత్వంలో `ఎవరు?` చిత్రంలో నటించినా కానీ దాంతో అభిమానులు పూర్తిగా సంతృప్తి చెందలేదు. ఆ తర్వాత ఆ కాంబోలో సిసలైన మల్టీస్టారర్ వస్తుందని ఆశించినా ఇన్నాళ్లు కుదరనే లేదు. ఇకపై కుదిరే వీలు కనిపించడం లేదు. వరుణ్ తేజ్- సాయి తేజ్ లను కలిపి అల్లు అరవింద్ ఓ మల్టీస్టారర్ తీస్తానని ప్రామిస్ చేసినా దానికి సంబంధించిన స్క్రిప్టు ఇప్పటివరకూ రెడీ కాలేదు. దీనికి చాలా సమయమే పట్టేట్టు ఉంది. భవిష్యత్ లో సాయి తేజ్ అతడి సోదరుడు వైష్ణవ్ తేజ్ కలిసి నటించే వీలుంటుంది. కానీ దానికి ఇప్పట్లో సన్నాహకాలేవీ లేవు.
ఇకపోతే నందమూరి హీరోలు కలిసి సినిమా చేస్తారా? అంటే అలాంటి సన్నివేశం ఇప్పట్లో కనిపించడం లేదు. బాలయ్య – ఎన్టీఆర్ -కల్యాణ్ రామ్ కలిసి నటిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. కానీ అది నెరవేరడం అంత వీజీ కానే కాదని అర్థమైపోతోంది. ఇక నటసింహా వారసుడు మోక్షజ్ఞ అసలు హీరోగా వస్తాడా? అన్నది అనుమానమే. అలాంటప్పుడు బాలకృష్ణ- మోక్షజ్ఞ కాంబినేషన్ సినిమాని ఆశించలేని పరిస్థితి నందమూరి అభిమానులకు ఉంది.
ఇక విక్టరీ వెంకటేష్ – దగ్గుబాటి రానా మల్టీస్టారర్ కి చాలానే సమయం పట్టేట్టు ఉంది. ఆ ఇద్దరూ ఎవరికి వారే డిఫరెంట్ సినిమాలతో బిజీ. అలాగే అక్కినేని హీరోల్లో నాగచైతన్య- అఖిల్ కలిసి నటించే సినిమా ఎప్పటికి సాధ్యం? అంటే ఇప్పట్లో చెప్పలేని పరిస్థితి. ఫ్యామిలీ హీరోలతో మల్టీస్టారర్లు అంటే అది దర్శకనిర్మాతలకు కూడా చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే. ఎవరినీ తక్కువ చేసి చూపించకూడదు. అందరినీ మెప్పించే స్క్రిప్టును రాయడమే రచయితలకు మరో పెను సవాల్. అందుకేనేమో! ఇవేవీ ఇప్పట్లో కుదిరేట్టు కనిపించడం లేదు.