మరీ ఎక్కువ సాగదీస్తే విసుగొస్తుంది. లాక్కునేంత వరకూ వెళితే ఇంతే మరి. చివరికి చినిగి చాటవుతుంది. ప్రస్తుతం సినిమా వాళ్ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తీరు ఇలానే ఉందంటూ విమర్శలొస్తున్నాయి. లాక్ డౌన్ ఎత్తేసే విషయంలో అందరికీ వెసులుబాటు ఇస్తున్నా సినీపరిశ్రమకు మాత్రం ససేమిరా అనేస్తున్నారు. ఒక్కో రంగానికి నెమ్మదిగా సడలింపులు ఇచ్చేస్తున్నా.. వీళ్లను క్యూలో వెయిట్ చేయిస్తున్నారు. దీంతో ఇప్పుడు విసుగెత్తే పరిస్థితి కనిపిస్తోంది.
ఇరుగు పొరుగును పరిశీలిస్తే మలయాళంలో ఇప్పటికే షూటింగులకు పోస్ట్ ప్రొడక్షన్స్ కి వెసులుబాటు కల్పించారని సమాచారం ఉంది. అలాగే తమిళనాడును కొవిడ్ 19 అట్టుడికిస్తున్నా కానీ.. అక్కడ లాక్ డౌన్ పేరుతో సినిమా వాళ్లకు ట్రబుల్స్ క్రియేట్ చేయడం లేదు. ఇటీవల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కి వెసులుబాటు కల్పించారు. దీంతో ఇప్పటికే చెన్నయ్ సహా పలు నగరాల్లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యకలాపాలు సాగుతున్నాయట.
దీంతో మన నిర్మాతల చూపు చెన్నయ్ వైపు మళ్లుతోంది. ఇక్కడ పర్మిషన్లు రాకపోతే ఇక అటువైపు వెళ్లి అక్కడే నిర్మాణానంతర పనుల్ని కానిచ్చేయాలి చూసే వాళ్లు ఎక్కువయ్యారట. తొలిగా రవి తేజ `క్రాక్` సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చెన్నై ల్యాబులో ప్రారంభించేశారట. దీంతో వీళ్ల బాటలోనే ఇతరులు అటు జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారని తెలిసిందే. మే8న రిలీజవ్వాల్సిన `క్రాక్`సినిమాని కరోనా లాక్ డౌన్ అలా వాయిదా వేయించిన సంగతి తెలిసిందే.
ఇదే నిజమైతే.. అంత కష్టం ఎందుకని.. హైదరాబాద్ ల్యాబులకు పర్మిషన్స్ ఇచ్చేస్తే పోయేదేముంది? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. సీఎం కేసీఆర్ కానీ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని గానీ దీనిపై చాలా స్పష్ఠంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. కొవిడ్ 19 విజృంభణ అంతకంతకు పెరుగుతోంది. అందువల్ల మరో 2-3 నెలల పాటు సినీపరిశ్రమకు ఎలాంటి వెసులుబాటు ఇవ్వలేం అన్నట్టుగానే చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో కాస్త ఆగితే కానీ తేలదు.