ఫస్టాఫ్‌ని కరోనా నమిలేసిందిగా.. సెకండాఫ్ అయినా!
తెలుగు సినీపరిశ్రమకు ఫస్టాఫ్ నేర్పిన పాఠం ఏమిటి? .. అంటే చాలానే జాగ్రత్తలు నేర్పించింది. ఒకే ఒక్క మహమ్మారీ ఎన్నో కొత్త సంగతుల్ని తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా బడ్జెట్లు పేరుతో అదుపు తప్పి కాస్ట్ ఫెయిల్యూర్ అయితే అంతే సంగతి అని .. హీరోలు డైరెక్టర్ల పారితోషికాలు అడ్డగోలుగా పెంచితే ఇక పరిశ్రమ నడవడం కష్టమేనని కరోనా పాఠం నేర్పింది. దీంతో పాటు పారితోషికాలు పేరుతో దోచి పెట్టేయడం కూడా కరెక్ట్ కాదని తేలింది. అలాగే మలయాళ చిత్ర పరిశ్రమ తరహాలో పరిమిత బడ్జెట్లతో సినిమాలు తీయాలని.. డిజిటల్ సినిమా అభివృద్ధి వైపు ఆలోచించాలని .. నేరుగా డీటీహెచ్ కి ఆస్కారం కల్పించాలని కూడా కొవిడ్ మహమ్మారీ పాఠం నేర్పించింది.
సంక్రాంతి బరిలో రిలీజైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సత్ఫలితాల్ని సాధించి ఫస్టాఫ్ కి బూస్ట్ ఇచ్చాయి. ఆ వెంటనే భీష్మ బంపర్ హిట్ కొట్టడం కూడా కలిసొచ్చింది. ఇదే ఊపులో మరిన్ని హిట్లు కొట్టాలన్న పంతం మన నిర్మాతల్లో కనిపించినా కానీ ఈలోగానే మమమ్మారీ దాపురించి ఉత్సాహానికి అడ్డుకట్ట వేసింది.
టాలీవుడ్ లో పెండింగ్ సినిమాల రిలీజ్ ఎప్పుడు?
పలువురు టాప్ స్టార్లు నటించిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. దాదాపు 20 సినిమాల రిలీజ్ లు సందిగ్ధంలో పడిపోయాయి. వీటన్నిటి రిలీజ్ ఎప్పుడు? అన్న సందిగ్ధత నెలకొంది. సంక్రాంతి తర్వాత సమ్మర్ ఎప్పుడూ ఆదుకుంటుంది. కానీ ఈసారి సమ్మర్ రిలీజ్ లన్నీ గాయబ్ అయిపోయాయి. మహమ్మారీ దెబ్బకు పరిశ్రమకు సమ్మెట పోటు తప్పలేదు. అయితే ఈ సినిమాల్ని దసరాకి అయినా రిలీజ్ చేస్తారా? అంటే సందేహమేనట. అయితే క్రిస్మస్ లేదా సంక్రాంతి అన్న ధోరణి కనిపిస్తోందట. అంటే డిసెంబర్ వరకూ వేచి చూసే ధోరణితోనే ఎగ్జిబిటర్లు ఉన్నారని అప్పటివరకూ రిలీజ్ లు ఉండవని తెలుస్తోంది. కనీసం అప్పటికి అయినా మహమ్మారీకి వ్యాక్సిన్ వస్తే .. రిలీఫ్ దక్కితే రిలీజ్ లకు ఆస్కారం ఉంటుందన్న ఆశ ఉందిట.