సోనూసూద్‌ కు గుడి కట్టిన తెలంగాణ వాసి !

సోనూసూద్ .. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఆపదలో ఉన్నాం అంటే ప్రభుత్వం స్పందించిందో లేదో కానీ అన్నా కష్టాల్లో ఉన్నాం ఆదుకో అన్నా అంటూ సోనూసూద్ కి ఒక్క మేసేజ్ పంపితే చాలు క్షణాల్లో ఆ కష్టం తీరిపోయేలా చేశారు. సినిమాల్లో విలన్‌గా కనిపించినప్పటికీ ఇప్పుడు అందరి దృష్టిలో హీరో అయ్యాడు. లాక్ ‌డౌన్‌ సమయంలో కష్టాల్లో ఉన్న వారికి విశేషమైన సేవలందించి రియల్‌ హీరోగా నిలిచాడు సోనూ సూద్‌.

Temple Dedicated to Sonu Sood by Telangana Siddipet Villagers  - Sakshi

ఈ నేపథ్యంలో ఓ అభిమాని సోనూసూద్‌ కి ఏకంగా గుడి కట్టేశాడు. తన సొంత ఖర్చుతో సోనూసూద్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు ఆ అభిమాని. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం దుబ్బ తండా పరిధిలోని చెలిమితండాలో సోనూ సూద్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. చెలిమితండాకు చెందిన రాజేష్ రాథోడ్‌కు సోనూసూద్‌ అంటే అభిమానం. కరోనా సమయంలో ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలకు ముగ్ధుడైన రాజేష్‌ తమ తండాలో సోనూ సూద్‌ కోసం ఏకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. రాజేష్‌ సొంత ఖర్చుతో ఏర్పాటు చేయడం గొప్ప విషయమని తండా వాసులు అభినందించారు. ఇక ఆదివారం స్థానికులు విగ్రహానికి పూజలు నిర్వహించి హారతి కూడా ఇచ్చారు.

రాజేష్‌ మాట్లాడుతూ.. ‘సోనూసూద్‌ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలకు సాయం చేశారు. ఆయన సేవలను గుర్తించి ఐక్యరాజ్యసమితి ఎస్‌డీజీ స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్‌ అవార్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మేం సోనూ సూద్‌కి విగ్రహం ఏర్పాటు చేసి మా అభిమానాన్ని చాటుకుంటున్నాం. దేవతల మాదిరిగానే ప్రతిరోజు సోనూ సూద్‌ విగ్రహానికి పూజలు చేస్తాం’ అని తెలిపారు.