‘యాత్ర’ టాక్, కథ ఏంటి, వర్కవుట్ అవుతుందా?

వైఎస్‌. రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. వైఎస్‌ పాత్రలో మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి నటించారు. మహి వి. రాఘవ్‌ దర్శకత్వంలో శివ మేక సమర్పణలో విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఇప్పటికే యుఎస్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ నేపధ్యంలో చిత్రం టాక్ బయిటకు వచ్చింది.

ప్రీమియర్ షో ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం… వైయస్ ని గ్లోరిఫై చేయటానికి ఉద్దేశించినట్లుంది. ముఖ్యంగా ఈ సినిమాని ఓ మంచి డాక్యుమెంటరీగా వైయఎస్ అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంది. మిగతా వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారనేదానిపై ఈ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది.

ఇక సినిమాలో ప్రధాన కథ కంటే వైఎస్ కి సంబంధించిన పొలిటికల్ సిచువేషన్స్ పై ఎక్కువ దృష్టి పెట్టారు. అక్కడక్కడా వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ని పాటు, కొన్ని వివాదాస్పద సన్నివేశాలను కూడా దర్శకుడు ఇరికించే ప్రయత్నం చేశాడు.

చంద్రబాబు పాలనకు కౌంటర్ ఇస్తూనే మరోవైపు కాంగ్రెస్ పాలనలో లోపాలను, వైఎస్…స్వయంగా పార్టీలో ఎలా గుర్తింపు తెచ్చుకొని జనాల్లో హీరో అయ్యారు అనే సీన్స్ పైనే దృష్టి పెట్టాడు దర్శకుడు. మమ్ముట్టి తన నటనతో వైయస్ క్యారక్టర్ కు న్యాయం చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే సీన్స్ అలాగే మరికొన్ని ఎమోషనల్ మూమెంట్స్ స్క్రీన్ పై వైఎస్ అభిమానులని ఎట్రాక్ట్ చేస్తాయి.

‘నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకున్నాం కానీ… జనానికి ఏం కావాలో తెలుసుకోలేకపోయాం’ , “మన గడప తొక్కి సాయం అడిగిన ఆడ బిడ్డతో రాజకీయం ఏందిరా?” వంటి డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయని టాక్. సినిమా చివరలో జగన్ స్పీచ్ తో సినిమాకు ఎండింగ్ టచ్ ఇచ్చారు. జగన్ తండ్రి గురించి మాట్లాడే ఒరిజినల్ సీన్ తో సినిమా ఎండ్ అవుతుంది.