తెలుగు సినిమా రంగంలో దర్శకుడుగా ఆదుర్తి సుబ్బారావుది ఓ విలక్షణ శైలి. ఈరోజు ఆదుర్తి సుబ్బారావు 106వ జయంతి. అక్టోబర్ 1, 1975లో తన 62వ సంవత్సరంలో చనిపోయారు. అయన భౌతికంగా మన మధ్యలేకపోయినా అయన దర్శకత్వం వహించిన సినిమాల ద్వారా మధుర స్మృతులను పంచుతూనే వున్నారు.
1954లో”అమర సందేశం” చిత్రం తో దర్శకుడైన సుబ్బారావు 1976లో “మహాకవి క్షేత్రయ్య” చిత్రం తరువాత చనిపోయారు. మంచి మనసులు, మూగ మనసులు, తేనెమనసులు, కన్నె మనసులు అనే చిత్రాలు పేరు వినగానే మనసు సుబ్బారావు గుర్తుకొస్తారు .
కుటుంబసమేతగా చూడతగ్గ సినిమాలకు దర్శకత్వం వహించిన సుబ్బారావు అభ్యుదయ భావాలున్నవాడు. అక్కినేని నాగేశ్వర రావు , ఆదుర్తి సుబ్బారావు సంయుక్తంగా నిర్మించిన “సుడిగుండాలు “, “మరో ప్రపంచం ” సినిమాలు ఆనాడు ఎందరినో ఆలోచింపజేశాయి .
“సుడిగుండాలు “సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరు కుమారులు వెంకట్, నాగార్జున బాల నటులుగా నటించారు . ఈ సినిమా తాష్కెంట్ , మాస్కో ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శింపబడింది. అలాగే ఆయన దర్శకత్వం వహించిన నమ్మినబంటు సినిమా కూడా విదేశాల్లో విమర్శకుల మన్ననలు అందుకుంది.
అయితే సుబ్బారావు కేవలం వ్యాపార దృక్ప్తమే పరమావధి కాకుండా సందేశాత్మక సినిమాలు కూడా నిర్మించిన మహనీయుడు. ఆయన సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చాయంటే సుబ్బారావు ఎంత ప్రతిభావంతుడో అర్ధం చేసుకోవచ్చు . తెలుగు, హిందీ రంగాల్లో సుబ్బారావు ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించాడు . చక్కటి స్క్రీన్ ప్లే , ఎడిటింగ్ లో సుబ్బారావు ప్రతిభావంతుడు .
సూపర్ స్టార్ కృష్ణ ను”తేనెమనసులు ” చిత్రం ద్వారా పరిచయం చేసింది సుబ్బారావే . నేటి ప్రసిద్ధ దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాధ్ ఆదుర్తి సుబ్బారావు శిష్యుడే . ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సుబ్బారావు పేరు మీద ఓ స్మారక అవార్డు ఉత్తమ దర్శకుడుకు ప్రదానం చేస్తుంది .
ఆదుర్తి సుబ్బారావు తో పాటు ఆయన శ్రీమతి కామేశ్వరి బాలను ఈ ఫొటోలో చూడవచ్చు.
– భగీరథ