అర్జున్‌పై “మీ టూ” ఆరోపణలు చేసిన హీరోయిన్‌కు బెదిరింపులు

సౌత్ ఫిలిం ఇండస్ట్రీ హీరో అర్జున్ పై “మీ టూ” ఆరోపణలు చేసారు కన్నడ హీరోయిన్ శృతి హరిహరన్. ఆమె చేసిన ఈ ఆరోపణలను ఖండించారు హీరో అర్జున్. ఇప్పుడు దక్షిణాదిన ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. కాగా హీరో అర్జున్ పై ఆరోపణలు చేసిన తరువాత నుండి ఆమెకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ మరో బాంబు పేల్చారు శృతి హరిహరన్.

బెంగుళూరులో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనకు వస్తున్న బెదిరింపు కాల్స్ గురించి వెల్లడించారు. “నా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. కానీ నేను లిఫ్ట్ చేయడం లేదు. ట్రూ కాలర్ ద్వారా అవి అర్జున్ అభిమానుల నుండి వస్తున్న కాల్స్ గా గుర్తించాను”. అని తెలిపారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ…సుదీప్, దర్శన్ లాంటి హీరోల పక్కన నటించాను కానీ నాకు ఎక్కడా అలాంటి వేధింపులు ఎదురవలేదు. అర్జున్ వేధించినపుడే బయటపెట్టడానికి నాకు ధైర్యం సరిపోలేదు. నాలాగే లైంగిక వేధింపులకు గురైనవారు ముందుకు వస్తుండటంతో నేనూ ధైర్యంగా నాకు జరిగిన వేధింపుల గురించి బహిర్గతం చేశాను. న్యాయం జరిగే వరకు పోరాడతాను అని వెల్లడించారు నటి శృతి హరిహరన్.

ఇదిలా ఉండగా హీరో అర్జున్ పై మరో మహిళా కూడా లైంగిక ఆరోపణలు చేసారు. మైసూరులో పదిహేను సంవత్సరాల క్రితం ఒక సినిమా షూటింగ్ కి వెళ్ళినప్పుడు అదే సినిమాలో నటిస్తున్న అర్జున్ తనను గదికి రమ్మన్నాడంటూ ఆరోపించారు సదరు మహిళ. ఇలా ఒక్కొక్కరిగా అర్జున్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం ఇండస్ట్రీ వర్గాల్ని షాక్ కి గురి చేస్తోంది.