ముప్పయ్ సంవత్సరాల నాటి సంగతి .
ఒక రోజు ఉదయం హైదరాబాద్ బంజారా హిల్స్ లో అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్ళాను . అప్పుడు జరుగుతున్న షూటింగ్స్ కవర్ చేయడానికి ఫ్లోర్ లోకి వెళ్ళాను . ఆ పని చూసుకొని తిరిగి కార్యాలయానికి వెళ్ళడానికి బయటకు వచ్చాను . ఆరోజు నాగేశ్వర రావు గారు కనిపించలేదు . ఆయన గత కొన్నాళ్లుగా మేకప్ వేయడం లేదు . అయినా బయటివారి షూటింగ్ జరుగుతుంటే తప్పకుండా వస్తాడు .
“ఈరోజు నాగేశ్వర రావు గారు స్టూడియోస్ కు రా లేదా ?” అని ప్రొడక్షన్ మేనేజర్ ను అడిగాను .
“సర్ పొద్దున్నే వచ్చారు , ఆఫీస్ రూమ్ లో వున్నారు ” చెప్పాడు . ఫోటోగ్రాఫర్ ను రమ్మని నాగేశ్వర రావు గారు వుండే కాటేజ్ / కార్యాలయం వైపు బయలు దేరాను . ఇది స్టూడియోస్ లో క్రిటిక్స్ కోవ్ కు ఎదురుగా ఉంటుంది . నాగేశ్వర రావు గారిని ఎవరైనా కలవాలంటే ఇక్కడికే రమ్మంటాడు .
నేను వెళ్ళేటప్పటికి సమయం 12. 30 అవుతుంది . సరిగ్గా ఒంటి గంటకు ఆయన భోజనానికి ఇంటికి వెడతాడు .తలుపు వేసి వుంది . నాగేశ్వర రావు గారు వెళ్లిపోయాడేమో అనే అనుమానం వచ్చింది . అయితే ఆయన స్వయంగా డ్రైవ్ చేసుకొని వచ్చే ఎరుపు రంగు టయోటా కారు బయట వుంది .తలుపు కొట్టాను . కాస్సేపటికి బాయ్ వచ్చి తలుపు తీశాడు . నన్ను చూసి ” అయ్యగారిని అడిగి వస్తా ” అని లోపలకు వెళ్ళాడు .
అలా అనడం నాకు కొత్తగా అనిపించింది . నాగేశ్వర రావు గారు ఎక్కడ వున్నా అనుమతి లేకుండా వెళ్లే చనువు నాకుంది వుంది .అలా ఆలోచిస్తూ ఉండగానే బాయ్ వచ్చి “రండి ” అన్నాడు .
నాగేశ్వర రావు గారు రోజు కూర్చునే చోట లేరు . పక్కనే వున్నబెడ్ రూంలో వున్నారు . ఆ సమయంలో ఆయన పడుకోరు . అనుకుంటూ లోపలకు ప్రవేశిస్తూ ఫోటోగ్రాఫర్ ను బయటనే ఉండమని చెప్పాను .
బెడ్ రూంలోకి వెళ్ళగానే నాగేశ్వర రావు గారిని చూసి ఆశర్యపోయాను . ఆయన నేలపై కూర్చున్నాడు . నన్ను చూసి “కూర్చోండి ” అన్నాడు. అద్దం చూసుకుంటూ ” ఎలావున్నాను ?” అని అడిగారు . “రావుగారిల్లు” సినిమా చేసిన తరువాత ఆయన ఎందుకో గ్యాప్ తీసుకున్నారు . ఎందుకు అనేది ఎవరికీ అర్ధం కాలేదు . కొత్త సినిమా ఒప్పుకోలేదు .
” ఆధ్యాత్మిక ధ్యానం చేస్తున్నారా ?” అడిగాను .
“అలాంటివి నావంటికి పడవని మీకు తెలుసు కదా ? “అన్నారు .
నిజమే అయన దైవారాధన చేయడు . ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడతాడు కానీ పాటించడు .
ఆయన వైపు చూస్తున్నాను . ఇంతలో బాయ్ వచ్చి మంచి కాఫీ ఇచ్చాడు .
కాఫీ తాగుతూ ఆయన వైపు చూశాను .
” నన్ను చూస్తుంటే మీకెవరు గుర్తుకు రావడం లేదా?” అన్నాడు .
ఆయన వైపు కాసేపు అలాగే చూశాను . బుర్రలో లైట్ వెలిగింది .
“రామ కృష్ణ పరమ హంస … లాగా అనిపిస్తున్నారు ” అన్నాను
“కరెక్ట్ .. రామకృష్ణ పరమ హంస అద్వైత , వేదాంత , భక్తి తత్వాలంటే నాకు ఎంతో ఇష్టం . మానవ సమాజానికి మంచి సందేశాన్ని అందించాడు ,. స్వామి వివేకానంద శిష్యుడైన రామకృష్ణ పరమ హంస బోధనలు ఈ తరానికి చెప్పాలని నా సంకల్పం . అందుకే ఆ పాత్ర ధరించాలనే ఆలోచనతో నన్ను నేను రామకృష్ణలా చూసుకోవడానికి సన్నద్ధమవుతున్నా ” చెప్పాడు అక్కినేని.
“నిజమే రామకృష్ణ పరమ హంస 18 ఫిబ్రవరి 1836లో కలకత్తా లోని హుగ్లీలో జన్మించాడు . జీవితమంతా ఆధ్యాత్మిక భోధనలతో గడిపి 16 ఆగష్టు 1886 తన 50 ఏట ఇహలోక యాత్ర చాలించాడు . భారత దేశంలో జన్మించిన మహా తత్వవేత్త రామకృష్ణ పరమ హంస” అని చెప్పాను .
” ఈ ఫోటో తీసుకుంటా ” అన్నా . కాసేపు అలోచించి “సరే ” అన్నాడు . వెంటనే ఫోటోగ్రాఫర్ ను పిలిచాను ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో అప్పటిదే . 1988 సంవత్సరం నాటి ముచ్చట . రామకృష్ణ పరమ హంస పాత్రలో మాత్రం అక్కినేని నటించలేదు . కారణాలు మాత్రం తెలియదు . విశేషమేమంటే ఆ సంవత్సరం కేవలం ఒక్క సినిమానే నటించాడు .
-భగీరథ