హైదరాబాద్ లో సినిమా ఇండస్ర్టీని హాలీవుడ్ ఇండస్ర్టీలా డెవలెప్ చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే వాగ్ధానం చేసిన సంగతి తెలిసిందే. తన మంత్రి వర్గంలో సినిమాటోగ్రఫీ అనే ఓ శాఖను ఏర్పాటు చేసి అందులో ఓ మంత్రిని నియమించి..అతన్ని ఇండస్ర్టీలో అందరికీ టచ్ లో ఉండమని పంపించారు. ఆ విషయంలో ఆ మంత్రి కేసీఆర్ చెప్పింది చెప్పినట్లు చేసారు. అధికారం వచ్చిన తర్వాత తొలి ఐదేళ్ల కేసీఆర్ పాలన ముగిసి రెండవసారి కూడా మళ్లీ సీఎంగా కేసీఆర్ అయ్యారు. మరి హైదరాబాద్ లో స్టూడియోల పరంగా అభివృద్ధి ఏదైనా జరిగిందా? అంటే కనీసం ఒక్క స్టూడియోకి కూడా ఇప్పటివరకూ పునాది రాయి పడలేదు. ఎక్కడో 200 ఎకరాలు ల్యాండ్ కేటాయించామని చెబుతున్నారు తప్ప! అక్కడ అసలు ఏం జరుగుతుందో? కూడా నేటికి తెలియని పరిస్థితి.
అలాగే తెలంగాణ యాస నేపథ్యంలో సినిమాలు రావాలని..మన సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటాలని వేదికలపై ఉపన్యాసాలకే పరిమితం తప్ప! ఇప్పటివరకూ ఆ రకంగా ముందుకు ఒక్క అడుగు కూడా పడలేదు. స్థానిక ప్రతిభను ప్రోత్సహించాలని…ఆరకం గా అప్పటికే ఎదిగిన ఏపీ పెద్దలంతా అవకాశాలు కల్పించాలని కోరడం జరిగింది. కానీ వాళ్లకి అవకాశాలు ఎక్కడ? ఎదిగింది ఎక్కడ? ఆ విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఈ విషయంలో కేసీఆర్ ని మహిపాల్ యాదవ్ అనే ఒక ఓయూ విద్యార్ధి నాయకుడు సోషల్ మీడియా వేదికగా నిలదీసి కడిగేసాడు. మహిపాల్ యాదవ్ తానే ఓ సైన్యాన్ని సిద్దం చేసుకుని కేసీఆర్ సర్కార్ పై…అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకూ ఎన్ని రంగాలను అభివృద్ది చేసారో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
సినిమాల్లో ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదని నేటికి గొంతెత్తిన ఓకే ఒక్క యువ కెరటం అతను. తాజాగా ఈరోజే ఓ బ్రేకింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. తెలంగాణ డైరెక్టర్ ఎన్ . శంకర్ కి కేసీఆర్ 5 ఎకరాలు స్థలం స్టూడియో కట్టుకోమని ఇచ్చారుట. వాస్తవానికి ఆయన 15 ఎకరాలు అడిగారుట. కానీ కేసీఆర్ ఐదు ఎకరాలే ఇచ్చారని రివీల్ చేసారు. గతేడాది జూన్ లో ఆ స్థలం కేటాయించడం జరిగిందిట. ఏ స్టూడియో నిర్మాణానికి అయినా 15 ఎకరాలు తక్కువ కాకుండా ఉండాలిట. కానీ 5 ఎకరాల్లోనే ఇప్పుడు ఛాలెంజింగ్ ఏర్పాటు చేయాల్సి వస్తుందన్నారు. అలాగే `వేదిక` అనే ఓ సంస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ వేదిక ద్వారా టీ-న్యూ ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేసి సినిమాల్లో అవకాశాలు ఇప్పించడం, ఇవ్వడం చేస్తారుట. తానే సొంతంగా ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేస్తారుట.
అయితే ఇప్పటివరకూ లేని `వేదిక` ఈ ఏడాది ఆవిష్కృతం కావడం వెనుక రాజకీయ కోణం కూడా ఉందనే విమర్శలు తెరపైకి వస్తున్నాయి. ఆ వేదిక వెనుక కేసీఆర్ ఉన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు తెలంగాణ వాదులు శంకర్ బినామీగా మారారంటూ ఆరోపణలు తెరపైకి తెస్తున్నారు. శంకర్ తొలి నుంచి కేసీఆర్ విథేయుడిగా ఉన్న మాట వాస్తవం. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించే సినిమాలతో యువతను ఉత్తేజపరిచాడు. ఉద్యమంలో నూ..తనదైన కాన్సెప్ట్ లు ఎంచుకోవడంలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. మరి ఇప్పుడీ వేదిక ద్వారా ప్రభుత్వంపై వస్తోన్న విమర్శల్ని తిప్పికొడతారేమో చూద్దాం.