నాపై కొంతవరకే వాటి ప్రభావం – తమన్నా
ఇప్పటికీ ఆ పాత్ర ప్రభావం నుంచి బయటికి రాలేకపోతున్నా అంటూ తాము చేసిన కొన్ని పాత్రల గురించి, సినిమాల గురించి చెప్పే నటీ నటుల్ని చాలా మందినే చూస్తుంటాం. అయితే కథానాయిక తమన్నా మాత్రం తన వ్యక్తిగత జీవితంపై పాత్రల ప్రభావం కొంత వరకే అని చెబుతోంది. “పుష్కర కాలంగా సాగుతున్న నా ప్రయాణంలో నేను చేసిన ప్రతి కథ , పాత్ర కూడా నా మనసును తాకినవే. కథ వినేటప్పుడే ఆ పాత్రల్లో నన్ను నేను ఉహించుకొంటుంటా. ఒకొక్క పాత్ర ఒక్కో కొత్త జీవితాన్ని రుచి చూపిస్తుంటుంది. అలాంటి అనుభవం, అవకాశం నటులకి మాత్రమే ఉంటుందేమో.
ప్రతి కథ, పాత్ర కుడా సంతోషంతో పాటు భిన్నమైన అనుభూతులకి గురిచేస్తుంటాయి. అయితే ఆ పాత్రలు సినిమా సెట్ వరకే తప్ప, నా వ్యక్తిగత జీవితంలోకి ఎప్పుడూ రాలేదు. అందుకు కారణం నా కుటుంబమే అని నమ్ముతుంటా. సెట్లోకి వెళ్లాకే నేను నటిని. అక్కడనుంచి బయటికి వచ్చాక ఆ విషయమే మరచి పోతా. కుటుంబమే నాకు ప్రపంచం. మొదట్నుంచీ నేను సున్నిత మనస్కురాలిని. నాలో భావోద్వేగాలు ఎక్కువ. అయితే వాస్తవికతతో కూడిన ఎన్ని పాత్రలు చేసినా సహజమైన ఆ వ్యక్తిత్వం మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. దానివల్ల మేలే జరిగింది. నటులు చేసిన పాత్ర నుంచి బయటికి రాకపోతే కొత్త కథల్లో ఇమిడిపోవడం కష్టం” అంది తమ్మన్నా భాటియా తాజాగా బాలీవుడ్ పైనే మోజు పెంచుకుంటోంది. చూద్దాం.. ఆ మోజు ఎక్కడికి దారితీస్తుందో?!