నాగార్జున చేసిన ఈ పోలిక నచ్చలేదు !?
బుల్లితెర రియాలిటీ షో `బిగ్ బాస్ 3` సందడి గురించి తెలిసిందే. 15 మంది హౌస్ మేట్స్ తో నిరంతరం ఈ షో రచ్చకెక్కుతోంది. ఇంట్లో సభ్యుల మధ్య గొడవలు వివాదాలతో అంతకంతకు వేడెక్కుతోంది. అయితే ఈ షోలో కంటెస్టెంట్లు అంతా ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసుండాలని ఎవరైనా భావిస్తారా? అసలు వీళ్లు ఒకే ఫ్యామిలీ ఎలా అవుతారు? అన్న సందేహం కలగడం సహజం.
అయితే అందుకు భిన్నంగా కింగ్ నాగార్జున చేసిన ఓ వ్యాఖ్య పరిశ్రమలో చర్చకు వచ్చింది. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ-“నాన్న(ఏఎన్నార్) గారు జీవించి ఉన్నప్పుడు మొత్తం కుటుంబంలోని 30 మంది ఒకేచోట లంచ్ లేదా డిన్నర్ చేసేవాళ్లం. ప్రతి ఆదివారం అలా అందరం కలుసుకునేవాళ్లం. ఇంతకాలం మేమంతా ఒకే కుటుంబంలా కలిసి ఉండేందుకు అదెంతో సాయమైంది. హౌస్ లోని ఈ 15 మంది ఒకే కుటుంబంలా కలిసి మెలిసి ఎలా ఉంటారో చూడాలి“ అని అన్నారు.
అయితే కింగ్ చేసిన ఈ పోలిక సరికాదని సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. సినిమా లెజెండ్ ఏఎన్నార్ తో బిగ్ బాస్ షోని పోల్చడం సరికాదు. కుటుంబ సభ్యుల్ని ఒకేచోట కలిపేందుకు ఏఎన్నార్ ఆ పని చేశారు. కానీ బిగ్ బాస్ అంతా డబ్బు కోసం గెలుపు కోసం ఆడే ఆట“ అని అన్నారు. స్క్రిప్టు అందించిన రచయిత, హోస్ట్ నాగార్జున ఇలాంటి తప్పుడు స్టేట్ మెంట్స్ ఇవ్వకుండా మునుముందు ఎపిసోడ్స్ లో జాగ్రత్త పడాలి అని సూచించారు.