‘కబాలి’ డైరక్టర్ అరెస్ట్ ఆపమంటూ కోర్టు

రజనీకాంత్ తో కబాలి, కాలా చిత్రాలు తీసిన సినీ దర్శకుడు పా.రంజిత్‌. ఆ రెండు చిత్రాలతోనే అంతర్జాతీయం గా పేరు తెచ్చుకున్న ఆయన రీసెంట్ గా ఓ వివాదంలో చిక్కుకుని కోర్ట్ కు ఎక్కాల్సి వచ్చింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాజరాజ చోళన్‌ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపధ్యంలో పా.రంజిత్‌పై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఒత్తిడి పెరుగుతోంది. కుంభకోణ ప్రాంత ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు దర్శకుడు పా.రంజిత్‌పై మతకలహాలను రేకెత్తించడం, శాంతి భద్రతకు భంగం కలిగించడం లాంటి నేరాలపై కేసులు నమోదు చేశారు. దీంతో పా.రంజిత్‌ను అరెస్ట్‌ చేసే అవకాశం ఉండటంతో ఆయన ముందస్తు బెయిల్‌ కోరుతూ మదురై హైకోర్టు శాఖలో పిటిషన్‌ దాఖలు చేశారు.

అందులో తాను చరిత్రలో ఉన్న విషయాలనే చెప్పానని, తన వ్యాఖ్యలను సోషల్ మీడియా వక్రీకరించినట్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ గురువారం న్యాయమూర్తి రాజమాణిక్యం సమక్షంలో విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది దర్శకుడు పా.రంజిత్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయరాదని వాదించారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి సమాజంలో మాట్లాడటానికి ఎన్నో విషయాలు ఉండగా ప్రజలు గొప్పగా భావించే రాజరాజచోళన్‌ గురించి ప్రస్థావించాల్సిన అవసరం ఏముందని దర్శకుడు పా.రంజిత్‌కు అక్షింతలు వేశారు. అదే విధంగా ఈ నెల 19 వరకూ దర్శకుడిని అరెస్ట్‌ చేయరాదని ఉత్తర్వులు జారీ చేస్తూ, ఈ కేసుకు సంబంధించి తిరుప్పనంద పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ బదులు పిటిషన్‌ను 19వ తేదీన కోర్టులో దాఖలు చేయాల్సిందిగా ఆదేశించారు.

వివాదానికి కారణం అయిన వ్యాఖ్య

పా.రంజిత్‌ రీసెంట్ గా కుంభకోణం సమీపంలోని తిరుప్పనంద గ్రామంలో దళిత సంఘం నిర్వహించిన కార్యక్రమంలో గెస్ట్ గా పాల్గొన్నారు. ఆ వేదికపై ఆయన మాట్లాడుతూ…

ʹచోళరాజుల పాలనలో దళితులు తీవ్రంగా అణచివేయబడ్డారు, దేవదాసి వ్యవస్థను ప్రోత్సహిస్తూ నిమ్నకులాలను నీచంగా చూశారు. తంజావూర్ డెల్టా ప్రాంతాల్లో ఉన్న భూములన్ని వారు లాక్కున్నారు. వాస్తవానికి కుల అణచివేత ప్రారంభమైంది వారి పాలనలోనే. 400 మంది దళిత స్త్రీలు దేవదాసీలుగా, సెక్స్ వర్కర్లుగా మార్చబడ్డారు. దేవదాసి అనే వ్యవస్థ రూపుదిద్దుకున్నది వీరి హయాంలోనే. అంతే కాకుండా 26 మంది ప్రజలు కోలార్ గోల్డ్ ఫీల్డ్‌కు అమ్మివేయబడ్డారు. కాబట్టి కుల సమస్య ఈనాటిది కాదు. రాజారాజా చోళన్ పాలన దళితులకు చీకటి యుగంʹʹ అన్నారు.

ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. రంజిత్ మాట్లాడిన ఈ విషయాలు ʹహిందూ మక్కల్ కచ్చిʹ అనే సంస్థకు చెందిన తంజావూరు జిల్లా మాజీ కార్యదర్శి బాల రంజిత్ పై కేసు పెట్టాడు. నటుడు కరుణాస్‌ వంటి వారు పా.రంజిత్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇదిలాఉండగా తిరుప్పనంద గ్రామంలో పా.రంజిత్‌ చేసిన వ్యాఖ్యలపై పలువురు ఫిర్యాదులు చేశారు. ఆయన వ్యాఖ్యలు భారతీయ మతసామరస్యానికి వ్యతిరేకం అని, తమిళ స్త్రీల మనోభావాలను కించపరచేవిగా ఉన్నాయని పేర్కొన్నారు.