పా.రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కిన ‘తంగలాన్’ చిత్రంలో నటించడం వల్ల చర్మ వ్యాధుల బారిన పడినట్టు మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ తెలిపారు. బడా నిర్మాత కేఈ ఙ్ఞానవేల్ రాజా.. దర్శకుడు పా.రంజిత్ కు చెందిన నీలం ప్రొడక్షన్‌తో కలిసి ఈ చిత్రాన్ని భారీ బ్జడెట్‌తో తెరకెక్కించారు. కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ బంగారు గనుల్లో పనిచేసే తమిళ కూలీల ఇతివృత్తంతో పీరియాడికల్ మూవీగా దర్శకుడు పా.రంజిత్ రూపొందించారు.
ఈ సినిమా నిర్మాణంలో ఎదురైన అనుభవాలను మాళవిక మోహనన్ తాజాగా వివరించారు. ‘ఈ మూవీలో వైవిధ్యభరితమైన పాత్రలో నటించాను. వేషధారణ కూడా అలాగే ఉంటుంది. ప్రతి రోజూ మేకప్ వేసుకునేందుకు కనీసం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టేది. ఎర్రటి ఎండల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది.
సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే నేత్ర సమస్యలతో పాటు చర్మవ్యాధులతో ఇబ్బంది పడ్డాను. దీనికి కారణం.. మండిపోయే ఎండలు. పాత్ర కోసం వాడిన దుస్తులు. వేసిన మేకప్. దాదాపు ఐదారు మంది స్కిన్ స్పెషలిస్టుల (వైద్యులు)ను సంప్రదించాల్సి వచ్చింది’ అంటూ మాళవిక మోహనన్ ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తనకు ఎదురైన అనుభవాలను వివరించారు.