రిలీజ్ కు ముందు రీషూట్ టాపిక్ ఎందుకు రాజా?

సినిమా తాము అనుకున్నట్లు రాకపోతే రీషూట్స్ చేస్తూటారు. అందులో వింతేమీ లేదు. చాలా పెద్ద సినిమాలు, పెద్ద డైరక్టర్స్ సైతం రీషూట్ విధానాన్నే నమ్ముకుని హిట్స్ కొట్టారు. అయితే ఆ విషయాన్ని ఎవరూ హైలెట్ చేయరు. ముఖ్యంగా రిలీజ్ ముందు అదో గొప్ప విషయంగా చెప్పుకోరు. కానీ డైరక్టర్ తేజ మాత్రం తన తాజా చిత్రం సీత రీషూట్ చేసానని చెప్పారు. మీడియా వాళ్లు, సినిమా వాళ్లు తనెంత నిజాయితీ పరుడో అనుకోవాలని అలా అన్నారా లేక మనస్సులోంచి వచ్చిన మాటేనా కానీ ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా సీత ప్రీ రిలీజ్ పంక్షన్ లో తేజ ఇచ్చిన ఇంటర్వూలో వచ్చిన అంశం.

తేజ మాట్లాడుతూ…”నాకు జడ్జిమెంట్ లేదు. సినిమా తీశా.. ఎక్కడ తప్పులున్నాయో అని వెతుకుతున్నా. 90శాతం బాగుంది. ఇప్పటికి కూడా సినిమా సూపరా? బాగుందా? ఏంటో మీరే చూసి చెప్పాలి. నేను సినిమా అంతా తీసేసి పరుచూసి బ్రదర్స్‌ను పిలిచి చూడమన్నాను. వాళ్లు చెప్పిన కరెక్షన్స్‌తో మళ్లీ షూట్ చేసి అంతా సరిచేశా. ఎందుకంటే నాది అంత ఇంటలిజెంట్ బ్రెయిన్ ఏం కాదు..

కళ్లజోడు పెట్టుకుని ఏదో అలా కనిపిస్తా కానీ, యావరేజ్ బ్రెయిన్ నాది. చూసేవాళ్లు ఏమనుకుంటారంటే..కళ్లజోడు చూడగానే మేధావని అనుకుంటారు. కళ్లజోడు పెట్టుకున్నవాళ్లంతా మేధావులు కాదు.. కొంతమందే మేధావులుంటారు. తిట్టినా, పొగిడినా దాన్ని సినిమాలో పెట్టేస్తా. ఎందుకంటే నాకు సినిమా తప్ప ఇంకొకటి రాదు. హిట్లు తీసినా, ఫ్లాపులు తీసినా ఇక్కడే” అని చెప్పుకొచ్చాడు తేజ‌. అదీ సంగతి.